గన్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అమెరికాలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఓ దుండగుడు భారత సంతతికి చెందిన సిక్కు అధికారిపై విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. దీంతో ఆ అధికారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన సందీప్ సింగ్ ధలివాల్.. అమెరికాలో ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సందీప్ సింగ్.. ఓ కారును ఆపాడు. అయితే అందులో ఓ వ్యక్తి, మహిళతో కలిసి ఉన్నాడు. అయితే కారును ఆపిన వెంటనే అందులో ఉన్న ఆ వ్యక్తి.. కిందకు దిగి సందీప్ సింగ్‌పై కాల్పులకు దిగడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే కాల్పులు జరిపిన దుండగుడు.. వెంటనే అక్కడి నుంచి సమీపంలోని ఓ షాపింగ్ మాల్‌లోకి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. షాపింగ్ మాల్‌లోకి పరారైన దుండగుడిని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ఉన్న మహిళను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, సందీప్ సింగ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.