Crude Oil: రష్యా నుంచి చమురు కొనొద్దని మాకు ఎవరూ చెప్పలేదు: అమెరికా పర్యటనలో కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్

|

Oct 09, 2022 | 7:56 AM

భారత్‌ ఆంక్షలను పట్టించుకోకుండా రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకోవడంపై విమర్శలు వచ్చాయి. వీటిని విదేశాంగమంత్రి జైశంకర్‌ ఇప్పటికే తిప్పి కొట్టారు. చమురు అవసరాల కోసం ఏ దేశం నుంచైనా కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Crude Oil: రష్యా నుంచి చమురు కొనొద్దని మాకు ఎవరూ చెప్పలేదు: అమెరికా పర్యటనలో కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్
Hardeep Singh Puri
Follow us on

ఉక్రెయిన్‌- రష్యా యుద్దం ప్రారంభమైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. రష్యాపై అమెరికా పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల ఫలితం ఇది. ప్రపంచ వ్యాప్తగా అనేక దేశాల్లో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు మండిపోతుంటే మన దేశంలో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇందుకు కారణం ఆంక్షలను పట్టించుకోకుండా రష్యా నుంచి భారత్‌ ఇంధనాన్ని కొనుగోలు చేయడమే.. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు రష్యా నుంచి మన కొనుగోళ్ల వాటా 0.2 శాతంగా ఉంటే, ఇప్పుడు 10 శాతానికి పెరిగింది. రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు 50 రెట్లు పెరిగాయి. భారత్‌ ఆంక్షలను పట్టించుకోకుండా రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకోవడంపై విమర్శలు వచ్చాయి. వీటిని విదేశాంగమంత్రి జైశంకర్‌ ఇప్పటికే తిప్పి కొట్టారు. చమురు అవసరాల కోసం ఏ దేశం నుంచైనా కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఇంధన అవసరాలు తీర్చడం తమ బాధ్యత అన్నారు.. గత నెలలో అమెరికాలో పర్యటించిన జైశంకర్‌ అక్కడి మీడియా అడిగిన ప్రశ్నలకు గట్టిగానే బదులు ఇచ్చారు. తాజాగా అమెరికాలో పర్యటించిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి ఈ విషయంపై స్పందించారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి.. చమురు కొనుగోలు అంశంపై భారత్‌ వైఖరిని స్పష్టంచేశారు. రష్యా నుంచి ఇంధ‌నాన్ని కొనుగోలు చేయొద్దని భారత్‌కు ఏ దేశం చెప్పలేదని, తమ అవసరాల దృష్ట్యా ఎవ‌రి నుంచైనా ఇంధ‌నం కొనుగోలు చేస్తామని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌ యుద్దం తర్వాత అమెరికాలో పెట్రోల్‌, డీజిల్ ధరలు 43 నుంచి 46 శాతం పెరిగితే, భారత్‌లో కేవలం 2 శాతం మాత్రమే పెరిగాయని గుర్తు చేశారు కేంద్రమంత్రి. ‘భారత్‌లో చమురు వినియోగం ఆధారంగానే ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తుంది. దేశ ప్రజలందరి అవసరాలకు తగినంత ఇంధనాన్ని అందించాల్సిన నైతిక బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. అవసరాల దృష్ట్యా ఎక్కడి నుంచైనా ఇంధనం కోనుగోలు చేస్తాం. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయొద్దని భారత్‌కు ఎవరైనా చెప్పారా? అని మమ్మల్ని ప్రశ్నిస్తే.. మా సమాధానం కచ్చితంగా లేదు అనే వస్తుంది’ అని పేర్కొన్నారు హర్‌దీప్‌ సింగ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..