ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రజల తరలింపు ఈ నెల 31 లోగా పూర్తి కావచ్చునని భావిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తెలిపారు. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆఫ్గాన్ లో ఇస్లామిక్ స్టేట్ నుంచి ముప్పు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అమాయకులైన ఆఫ్ఘన్లను లేదా అమెరికా దళాలను టార్గెట్ చేయడానికి టెర్రరిస్టులు పరిస్థితిని తమకు అనువుగా మార్చుకునే అవకాశాలున్నాయన్నారు. అక్కడ ఐసిస్ లేదా ఐసిస్-కె వంటి ఉగ్రవాద సంస్థల నుంచి ప్రమాదం పొంచి ఉందని..అయితే పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని బైడెన్ తెలిపారు. ఈ నెల 31 డెడ్ లైన్ ని పొడిగించే విషయమై తాము సైన్యంతో చర్చిస్తున్నామని..కానీ అది సాధ్యపడక పోవచ్చునని ఆయన అన్నారు. కాబూల్ విమానాశ్రయం వద్ద కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు తనను కలచివేశాయన్నారు. అయితే నష్టం లేకుండా-బాధాతప్త పరిణామాలు చోటు చేసుకోకుండా ప్రజల తరలింపు మాత్రం అయ్యే పని కాదని ఆయన పేర్కొన్నారు. డెడ్ లైన్ లోగా కాకపోతే ఇంకెప్పుడు ప్రజలను తరలించగలుగుతామని ఆయన ప్రశ్నించారు.
కాబూల్ ఎయిర్ పోర్టులో పరిస్థితిని అదుపు చేయడంలో అమెరికా విఫలమైందని తాలిబన్ అధికారి అమీర్ ఖాన్ ముతాకీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో బైడెన్.. ఈ మాటలన్నారు. ఆఫ్గనిస్తాన్ లో ఇంకా 15 వేలమంది అమెరికన్లు, 50 వేలమంది ఆఫ్ఘన్లు ఉన్నారని అంచనా.. వారిని తరలించాల్సి ఉందని అమెరికా ఇటీవల పేర్కొంది. ఈ నెల 14 నాటికి తాము 35 వేల మందికి పైగా అమెరికన్లను తరలించగలిగామని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ప్రజల తరలింపునకు అమెరికా ప్రభుత్వం ఆరు వైమానిక సంస్థలను రంగంలోకి దించింది. అమెరికన్ ఎయిర్ లైన్స్, అట్లాస్, డెల్టా, ఓమ్ని, హావాయియన్, యునైటెడ్ ఎయిర్ లైన్ కి చెందిన 18 ప్యాసింజర్ విమానాలను వినియోగించుకోనున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: 300 మంది తాలిబన్ల హతం..! పంజ్‌షీర్ లోయపై తాలిబన్లు కన్ను..:Afghanistan Crisis Live Video.