‘ అవెంజర్స్ ఎండ్ గేమ్ ‘ స్టార్ జెరినీ రెనెర్ తన రియల్ లైఫ్ లో విలన్ అనిపించుకున్నాడు. డ్రగ్స్ కు బానిసై.. నోట్లో గన్ తో కాల్చుకునే ప్రయత్నం చేశాడు. పైగా అదే గన్ తో తన ఇంటి రూఫ్ పై కాల్పులు జరిపాడు. ఇంతటితో ఆగక.. తన మాజీ భార్య సోనీ పచెకో ను కూడా హత్య చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడినప్పుడు ఇతని ఆరేళ్ళ కూతురు ‘ అవా ‘ ఇంటి పక్కగదిలో నిద్రిస్తోందట. ఇంతకీ ఈ ఒకప్పటి దంపతుల మధ్య విభేదాలకు అమాయకురాలైన ఈ చిన్నారి కారణమవుతోందంటే నమ్మలేం. 2014 లో జెరినీ..మోడల్, నటి కూడా అయిన సోనీని పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి కాపురం ఏడాదిపాటు మాత్రమే కొనసాగింది. అప్పటికే వీరి బేబీ చిన్న పిల్ల..తమ మధ్య కలతల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అయితే ‘ అవా ‘ ఎవరి సంరక్షణలో ఉండాలన్న విషయంలో వివాదం తలెత్తింది. కోర్టు.. కొంతకాలం ఆ అమ్మాయి తండ్రి వద్ద, మరికొంత కాలం తల్లి వద్ద ఉండాలని తాత్కాలికంగా తీర్పునిచ్చింది.
అయితే తన కూతురు పూర్తి సంరక్షణ బాధ్యత తానే వహిస్తానని, ఆమెపై తనకే అన్ని హక్కులూ ఉన్నాయని జెరినీ వాదిస్తున్నాడు. ఇక సోనీ సైతం అతనితో వాగ్యుధ్ధానికి దిగుతూ.. తమ కూతురు అతని సంరక్షణలో ఉంటే ఆమెకు ప్రాణహాని ఉందని, తాగుబోతు, మద్యానికి కూడా బానిసైన తన మాజీ భర్త ఆమెపై లైంగిక దాడికి దిగినా ఆశ్చర్యం లేదని వాదించింది. అంతేకాదు.. నన్ను హతమారుస్తానని జెరెమీ చాలాసార్లు బెదిరించాడని పేర్కొంది. కానీ ఈ ఆరోపణలను జెరెమీ ఖండిస్తున్నాడు. తన కుమార్తె బాగోగులను సోనీ చూసుకోజాలదని, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆమె వల్లే నిజానికి తన కూతురుకు ప్రాణహాని ఉందని చెబుతున్నాడు.కోర్టు సూచనల ప్రకారం … నా కూతురి ఖర్చులకోసం నా మాజీ భార్యకు నెలకు కొంత ‘ భరణం ‘ కూడా చెల్లిస్తున్నానని అంటున్నాడు. తన మూవీల పారితోషికం పెరుగుతున్న కొద్దీ ఈ భరణం మొత్తం కూడా అతగాడు దాని ప్రకారం పెంచి చెల్లించాల్సిందే.కాగా- వీరికి కూతురి విషయంలో కోర్టు తుది తీర్పు వచ్ఛే నవంబరులో ఇవ్వనుంది.