WHO Team Wuhan: కరోనా వైరస్ చైనాలోని వూహాన్‌లో పుట్టిందని, అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు పాకిందని చాలా కాలం నుంచి ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చైనాలో పర్యటించి ఆధారాలు సేకరించాలని ప్రపంచ దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)పై ఒత్తిడి తీసుకురావడంతో గత రెండు వారాలకుపైగా డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తల బృందం చైనాలో పర్యటిస్తోంది. ఇక చైనాపై వస్తున్న ఆరోపణలను సైతం చైనా ఖండిస్తూ వస్తోంది. అయితే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా పలు పలు దేశాల శాస్త్రవేత్తలు వూహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వూహాన్‌లో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం కరోనా మహమ్మారి పుట్టిక, వ్యాప్తికి సంబంధించి వివరాలు, ఆధారాల సేకరిస్తోంది. ఈ పర్యటనలో 14 మందితో కూడిన బృందం రెండు వారాలుగా క్షేత్ర స్థాయిలో పర్యటన చేస్తోంది. కాగా, కోవిడ్ వ్యాప్తిలో వూహాన్ సీపుడ్ మార్కెట్ ప్రాత్రకు సంబంధించి ముఖ్య ఆధారాలు లభ్యమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సభ్యుడు పీటర్ డెస్‌జాక్ సోషల్ మీడియాల్లో ప్రకటించారు. ఫిబ్రవరి 10న పర్యటన ముగుస్తుందని, తాము తిరిగి వెళ్లేలోపు ఇందుకు సంబంధించిన ముఖ్యాంశాలు వెల్లడించే అవకాశం ఉందని న్యూయార్క్‌కు చెందిన శాస్త్రవేత్త వివరించారు. ఈ బృందం వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలతో కూడా సమావేశం అయింది. అలాగే మొదట్లో కరోనా వ్యాప్తి చెందిన సమయంలో కరోనా పేషెంట్లకు వైద్యం అందించిన ఆస్పత్రులను సైతం పరిశీలించి అక్కడి వైద్యులతో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.