
బ్రెజిల్ లోని ఎడ్ కాలిఫోర్నియా ప్రాంతంలో వీధి పక్కన చిన్నచిన్న హోటళ్లలో జనం కూర్చుని ఆహారం తింటున్నారు. మనుషులు నడిచే వాకింగ్ ట్రాక్ కు అటూ ఇటూ ఆ హోటళ్లు ఉన్నాయి. మధ్యలోంచి కొందరు అటూ ఇటూ తిరుగుతున్నారు. కాసేపటికి కొందరు వ్యక్తులు జాగింగ్ చేసుకుంటూ అటువైపు వచ్చారు. హోటళ్ల మధ్యలోని దారి నుంచి జాగింగ్ చేస్తూ వెళుతున్నారు. మొదట ఒకరిద్దరు, ఆ వెనుక ఓ ఏడెనిమిది మందిదాకా జాగింగ్ చేస్తున్నారు. జాగింగ్ చేస్తున్న వారిని చూసి, ఏదో జరిగిందని, అందుకే వాళ్లు పారిపోతున్నారేమో అని భావించిన ఓ మహిళ.. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందేమోనని అక్కడ్నుంచి లేచి పరుగు లంకించుకుంది. అది చూసి మరికొందరు పారిపోవడం ప్రారంభించారు. వెంటనే అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఒక్కరు కూడా మిగలకుండా అంతా పడుతూ లేస్తూ అక్కడి నుంచి పరుగెత్తారు. చివరికి చూస్తే ఏమీ లేదు. ఇంకా జాగింగ్ చేసేవారు మెల్లగా పరుగెడుతూ వస్తూనే ఉన్నారు. ఈ దృశ్యమంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. అయితే ఈ ఘటన రాత్రిపూట జరగడంతో అంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోను కోటిమందికి పైగా వీక్షించారు. లక్షమందికిపైగా లైక్ చేశారు. ఇది సరదాగా ఉందంటూ కొందరు, ‘మనుషుల తత్వమే అంత’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘‘దీనినే మాబ్ మెంటాలిటీ అని, ఫాలో ద క్రౌడ్ అని అంటారు” అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
పరుగో పరుగు..
“In Brazil, a group of people doing CrossFit passed by outside a restaurant, but those eating thought they were running away from something and decided to run away with them”
pic.twitter.com/3kls9AM6mL— Russiаn Market (@runews) September 24, 2022
అయితే.. ‘‘బ్రెజిల్ లో మాఫియా గ్యాంగులు ఎక్కువ. వీధుల్లోనే దాడులు, కాల్పులు జరుపుకోవడం వంటివి తరచూ జరుగుతుంటాయి. అందుకే ఒకరిద్దరు పరుగెత్తగానే.. అలాంటి మాఫియా ముఠా దాడి ఏదో జరుగుందేమోనన్న భయంతో మిగతావారు పరుగెత్తి ఉంటారు..” అని బ్రెజిల్ కు చెందిన ఓ నెటిజన్ వివరణ ఇచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..