South African Pilot: పైలట్ సీటు కింద నాగుపాము.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం

|

Apr 06, 2023 | 11:37 AM

విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే పైలట్‌ ఎరామస్‌కు తన నడుమువద్ద ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఏమై ఉంటుందని పరిశీలించిన పైలట్‌కు మైండ్‌ బ్లాంక్‌ అయింది. ఓ నాగుపాము తన సీటు కిందకు దూరుతూ కనిపించింది. కానీ ఎరామస్‌ భయపడకుండా సంయమనంతో వ్యవహరించారు.

South African Pilot: పైలట్ సీటు కింద నాగుపాము.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం
South African Pilot
Follow us on

దక్షిణాఫ్రియాలో ఓ చిన్న విమానం వార్సెస్టర్‌ నుంచి నెల్సుప్రీట్‌కు బయలుదేరింది. ఇందులో నలుగురు ప్రయాణికులు, పైలట్‌తో పాటు విమాన సిబ్బంది ఉన్నారు. గాల్లో విమానం ఎగురుతోంది. నిరాటంకంగా గమ్యానికి విమానం చేరుతుందనుకునే లోపు విమానంలో కలకలం మొదలైంది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే పైలట్‌ ఎరామస్‌కు తన నడుమువద్ద ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఏమై ఉంటుందని పరిశీలించిన పైలట్‌కు మైండ్‌ బ్లాంక్‌ అయింది. ఓ నాగుపాము తన సీటు కిందకు దూరుతూ కనిపించింది. కానీ ఎరామస్‌ భయపడకుండా సంయమనంతో వ్యవహరించారు. పాము సీటు కిందకి చేరడంతో ధైర్యం కూడగట్టుకొని విషయం గ్రౌండ్‌ కంట్రోల్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అనంతరం విమానాన్ని జోహాన్నెస్‌బర్గ్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశాడు. దీంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులంతా దిగిన తర్వాత పైలట్‌ కూర్చునే సీటు పైకి ఎత్తి చూడగా దానికింద నాగుపాము చుట్ట చుట్టుకొని పడుకొని ఉంది.

నిజానికి ప్రయాణానికి ముందు రోజే వార్సెస్టర్ ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానం రెక్కల కింద నాగుపామును గుర్తించారు. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో అది తప్పించుకుంది. ఆ మరుసటి రోజు అనూహ్యంగా కాక్‌పిట్‌లో ప్రత్యక్షమైంది. ఇక విమానం జోహాన్నెస్‌బర్గ్‌లో దిగాక కూడా పామును పట్టుకునేందుకు సిబ్బంది మరోసారి ప్రయత్నించారు. విమానం మొత్తం ఊడదీసి చూసినా పాము కనిపించలేదు. రాత్రి కావడంతో పామును వెతకడం ఆపి, పామును బయటకు రప్పించేందుకు విమానం చుట్టూరా ఆహారాన్ని పెట్టారు. మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ ఆహారాన్ని పాము తాకిన దాఖలాలు కనిపించలేదు. దీంతో.. పాము వెళ్లిపోయి ఉంటుందని వారు భావించారు. మరోవైపు ఇలాంటి ఘటన తాము ఎప్పుడూ చూడలేదని విమాన రంగ నిపుణులు చెబుతున్నారు. పైలట్‌ ధైర్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పిందని, లేదంటే విమానం అదుపు తప్పి ఘోర ప్రమాదం జరిగి ఉండేదని చెప్పుకొచ్చారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..