ప్రతి దేశానికి దాని సొంత రాజ్యాంగం ఉంటుంది. దేశాన్ని పాలించేందుకు అన్ని నియమాలు, నిబంధనలు రాజ్యాంగంలో రూపొందించబడతాయి. వాటిని అనుసరిస్తూ పాలకులు తమ దేశాన్ని పాలిస్తారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఏదైనా ఒక గ్రామానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు లేదా సర్పంచ్ ఆ గ్రామంలోని నియమాలు, నిబంధనలను ఏర్పరుస్తూ చట్టం చేసిన ఘటనలు గురించి ఎప్పుడైనా విన్నారా..! రాజ్యాంగం ప్రకారం ఏదైనా చట్టాన్ని పార్లమెంటులో రూపొందిస్తారు.. అది చట్టంగా అమలు కావడానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. అయితే పాకిస్థాన్ దేశంలోని ఒక గ్రామం సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుంది. నియమనిబంధనలు రూపొందించుకుని ప్రస్తుతం వార్తల్లో నిలిచింది ఆ గ్రామం. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలోని ఓ గ్రామం ప్రత్యేక రాజ్యాంగం, నిబంధనలు రూపొందించుకుని చర్చనీయాంశంగా మారిపోయింది.
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బనీర్ జిల్లా బునర్ ప్రాంతంలో ఉన్న ఆ ఊరి పేరు అన్సార్ మీరా. చాలా చిన్న గ్రామం. ఇక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడి అందరి అభిప్రాయాలను స్వీకరించి 20 సూత్రాల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో వరకట్న వేధింపులు, ఏరియల్ ఫైరింగ్, విద్యార్థుల స్మార్ట్ ఫోన్ల వాడకం వంటి వాటిపై నిషేధం విధించారు. అంతేకాదు వరకట్నంపై పూర్తిగా నిషేధం విధించారు. పెళ్ళికి అయ్యే ఖర్చును అదుపులో ఉంచడం కూడా రాజ్యాంగంలోని ఒక నియమం. మరణానికి సంబంధించిన విషయాలపై కూడా కొన్ని నియమాలు రూపొందించబడ్డాయి. తాము రాసుకున్న రాజ్యాంగంపై గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గౌరవం ఇస్తున్నారు. ఈ రాజ్యాంగంతో గ్రామస్తుల పరిస్థితి మెరుగుపడుతుందని అంటున్నారు.
రాజ్యాంగాన్ని రూపొందించిన గ్రామంలోని పెద్దలు, పండితులు
గ్రామంలోని రాజ్యాంగం విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించడంపై నిషేదాన్ని విధించింది. అంతేకాదు షరియా, స్థానిక సంప్రదాయాలకు భిన్నమైన ఆచారాలపై కూడా రాజ్యాంగం ప్రవేశపెట్టారు. ఇందులో మరో ముఖ్యమైన నిబంధన ప్రకారం.. ఈ గ్రామంలోని మహిళలకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది.
పాకిస్తానీ మీడియా కథనం ప్రకారం గ్రామంలోని పెద్దలు , పండితులు గ్రామానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని రచించారు. ఆడపిల్లల పెళ్ళికి తండ్రి డబుల్ కాట్ బెడ్, టీవీ, ఫ్రిజ్ వంటి కొన్ని వస్తువులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నుంచి ఎవరైనా తమ ఇంటి ఆడపిల్లకు పెళ్లి సమయంలో ఏదైనా ఇవ్వాలనుకుంటే శక్తికి మించిన వస్తువులు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తమ శక్తి మేర నగదు రూపంలో కూడా ఇవ్వవచ్చు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..