
వెనిజులాలో వరుస భూకంపాల కారణంగా తీవ్ర విధ్వంసం నెలకొన్న వేళ ఆశాకిరణంలా నిలిచిన ఒక అరుదైన ఘటన ప్రపంచాన్ని కదిలించింది. దాదాపు ఏడు రోజుల పాటు షాపింగ్ మాల్ శిథిలాల కింద చిక్కుకున్న 44 ఏళ్ల సెక్యూరిటీ గార్డు హెర్నాన్ ఆల్బెర్టో గిల్‌ను అంతర్జాతీయ సహాయక బృందాలు సజీవంగా రక్షించాయి. ఉత్తర వెనిజులాలోని లా గువైరా రాష్ట్రంలో ఉన్న తొమ్మిది అంతస్తుల గలేరియాస్ ప్లాయా గ్రాండే షాపింగ్ సెంటర్ కుప్పకూలడంతో గిల్ శిథిలాల కింద చిక్కుకుపోయాడు. ఎన్నో గంటలపాటు నిరంతరాయంగా సాగిన గాలింపు చర్యల అనంతరం అతడిని సురక్షితంగా బయటకు తీసుకురావడం సహాయక బృందాలకు పెద్ద విజయంగా నిలిచింది.
ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే వెల్లడించిన వివరాల ప్రకారం, గిల్‌ను రక్షించే ఆపరేషన్ సోమవారం (జూన్ 29) ప్రారంభమైంది. శిథిలాల కింద ఉన్న అతడికి ఒక గొట్టం ద్వారా నీరు, ఇతర అవసరమైన ద్రవాలను అందిస్తూ ప్రాణాలు నిలబెట్టారు. అయితే భవనం పూర్తిగా అస్థిరంగా ఉండటంతో నేరుగా చేరుకోవడం ప్రమాదకరంగా మారింది. దీంతో రక్షక బృందాలు రెండు వేర్వేరు సొరంగాలను తవ్వి, అత్యంత జాగ్రత్తగా ముందుకు సాగాయి. అనేక రోజుల కఠిన శ్రమ అనంతరం గురువారం ఉదయం హెర్నాన్ ఆల్బెర్టో గిల్‌ను స్ట్రెచర్‌పై బయటకు తీసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో చిలీ, ఎల్ సాల్వడార్, యునైటెడ్ స్టేట్స్, పోర్చుగల్, మెక్సికో, కోస్టారికా, వెనిజులా దేశాలకు చెందిన గాలింపు, సహాయక బృందాలు కలిసి పనిచేశాయి. శిథిలాలను తొలగించడం, ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాన్ని స్థిరీకరించడం, సురక్షిత మార్గాన్ని రూపొందించడం వంటి పనులను పగలు, రాత్రి తేడా లేకుండా కొనసాగించాయి. చిలీ అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం సహాయక చర్యలు సుమారు 70 గంటల పాటు సాగాయి. బయటకు తీసిన అనంతరం గిల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఎనిమిది రోజుల క్రితం నిమిషం వ్యవధిలో సంభవించిన రెండు భీకర భూకంపాలు వెనిజులాలో భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 2,295 మంది మరణించినట్లు నిర్ధారించగా, వేలాది మంది గాయపడ్డారు. గల్లంతైన వారి సంఖ్య ప్రారంభంలో 60 వేల వరకు నమోదైనా, కొనసాగుతున్న సహాయక చర్యలతో అది సుమారు 38,600కు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. అత్యంత ప్రభావిత ప్రాంతమైన లా గువైరాలో కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇంకా పూర్తిగా పునరుద్ధరించబడలేదు.
మరోవైపు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెనిజులా కోసం 10 వేల బాడీ బ్యాగ్‌లను సిద్ధం చేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు తెలిపారు. అలాగే మొత్తం మృతుల సంఖ్య 10 వేలకు మించి ఉండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) అంచనా వేయడం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది. ఈ విషాదం మధ్య హెర్నాన్ ఆల్బెర్టో గిల్ సజీవంగా బయటపడటం మాత్రం భూకంప బాధితుల్లో కొత్త ఆశను నింపిన ఘటనగా నిలిచింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..