ఇరాన్‌పై మళ్లీ విరుచుకుపడుతుందా..? ఇరాన్‌కు అమెరికా వార్నింగ్, ట్రంప్ సిచ్యుయేషన్ రూమ్‌లో కీలక భేటీ!

US Iran News: ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతోందనే వార్తలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెరిగింది. ఇజ్రాయెల్‌కు రీఫ్యూయలింగ్ విమానాలను పంపుతున్న అమెరికా, మరోవైపు అమెరికా దళాలపై చర్యకు సమయం దగ్గరపడిందని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ నిర్వహించిన అత్యవసర సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇరాన్‌పై మళ్లీ విరుచుకుపడుతుందా..? ఇరాన్‌కు అమెరికా వార్నింగ్, ట్రంప్ సిచ్యుయేషన్ రూమ్‌లో కీలక భేటీ!
Us Iran News

Updated on: Jul 18, 2026 | 12:33 PM

US Refuelling Aircraft: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై విస్తృత స్థాయి సైనిక చర్యకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న నేపథ్యంలో, అమెరికా కూడా కీలక ఏర్పాట్లు ప్రారంభించినట్లు ఆక్సియోస్ (Axios) నివేదిక వెల్లడించింది. సీనియర్ అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ వచ్చిన ఈ నివేదిక ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే రోజుల్లో ఇరాన్‌పై దాడికి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

ఇజ్రాయెల్‌కు రీఫ్యూయలింగ్ విమానాల తరలింపు

దాడి సన్నాహాల్లో భాగంగా అమెరికా డజన్ల కొద్దీ సైనిక రీఫ్యూయలింగ్ విమానాలను ఇజ్రాయెల్‌కు తరలిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో సుమారు 30 రీఫ్యూయలింగ్ విమానాలు, దక్షిణ ఇజ్రాయెల్‌లోని రామోన్ ఎయిర్‌పోర్టులో మరో 30 విమానాలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలోని ఇతర వైమానిక స్థావరాలు ఇరాన్ దాడులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉండటంతో, అమెరికా తన రీఫ్యూయలింగ్ కార్యకలాపాలను ప్రధానంగా బెన్ గురియన్ విమానాశ్రయం నుంచే నిర్వహించనున్నట్లు నివేదిక పేర్కొంది.

అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నౌకాదళం అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. మధ్యప్రాచ్యంలో గస్తీ నిర్వహిస్తున్న అమెరికా సైనిక దళాలు, వారి కదలికలు, సైనిక సామగ్రి అన్నీ తమ నిఘాలోనే ఉన్నాయని IRGC వెల్లడించింది. “ప్రాంతీయ జలాల్లో ఉన్న అమెరికా సెంట్‌కామ్ (CENTCOM) నౌకాదళంపై ఇరాన్ సాయుధ దళాల చర్యకు సమయం దగ్గరపడుతోంది” అని ఆ ప్రకటనలో పేర్కొంది. చివరగా “వేచి చూడండి” అంటూ అమెరికాకు హెచ్చరిక చేసింది.

వైట్ హౌస్‌లో అత్యవసర సమావేశం

మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ సిచ్యుయేషన్ రూమ్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరాన్‌పై చేపట్టే సైనిక చర్యలకు సంబంధించిన పలు ప్రత్యామ్నాయాలను చర్చించినట్లు సమాచారం. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు, అణు కేంద్రాలపై దాడులు చేసి యురేనియం నిల్వలను మరింత లోతుగా ధ్వంసం చేయడం, అలాగే ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధం ఉందని భావిస్తున్న అత్యంత భద్రత కలిగిన “పిక్‌యాక్స్ మౌంటెన్” భూగర్భ కేంద్రంపై దాడి వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు నివేదిక తెలిపింది. అయితే, తుది నిర్ణయం ఇంకా తీసుకోనప్పటికీ, ఇరాన్‌ను హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, అలాగే అణు ఒప్పందంపై అమెరికా షరతులను అంగీకరించేలా ఒత్తిడి తీసుకురావడానికి అవసరమైతే యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని సమాచారం.

కీలక అధికారులతో ట్రంప్ సంప్రదింపులు

ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ట్రంప్ తన తదుపరి నిర్ణయాలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్‌లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు.

హోర్ముజ్ జలసంధిలో అమెరికా దాడులు

అమెరికా వరుసగా ఐదో రోజూ హోర్ముజ్ జలసంధి ప్రాంతంలోని ఇరాన్ లక్ష్యాలపై దాడులు కొనసాగించినట్లు సమాచారం. ముఖ్యంగా రివల్యూషనరీ గార్డ్స్ కార్యకలాపాలకు కేంద్రంగా భావిస్తున్న బందర్ అబ్బాస్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, హోర్ముజ్ జలసంధి ప్రాంతానికి మందుగుండు సామగ్రి, సైనిక సరఫరాలు, అదనపు బలగాలను బందర్ అబ్బాస్ ద్వారా తరలిస్తున్నారని తెలిపారు.

అమెరికా యుద్ధవిమానాలను ధ్వంసం చేశామని ఇరాన్..

ఇదే సమయంలో, అమెరికా జరిపిన రాత్రి దాడులకు ప్రతీకారంగా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన అనేక రీఫ్యూయలింగ్ విమానాలు, యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయని, మరెన్నో విమానాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని IRGC ప్రకటించింది. అలాగే సిరియాలోని ఒక అమెరికా స్థావరాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ పేర్కొంది. అయితే, అమెరికా దళాలు ఆ స్థావరాన్ని ఇప్పటికే కొన్ని నెలల క్రితమే ఖాళీ చేసినట్లు సమాచారం.

కాల్పుల విరమణ విఫలం.. ఉద్రిక్తత కొనసాగుతోంది

గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైన తర్వాత, హోర్ముజ్ జలసంధి నియంత్రణ కోసం అమెరికా, ఇరాన్ మధ్య వరుస దాడులు కొనసాగుతున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి.

Follow Us