Omicron Death: అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం.. ధృవీకరించిన అధికారులు
Omicron Death: ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకు విస్తరిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి..
Omicron Death: ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకు విస్తరిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇక అమెరికాలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు టెక్సస్ వైద్యాధికారులు ధృవీకరించారు.
ఇక అమెరికాలో కరోనా కేసులు పెరుగుతుండటంలో పలు ప్రాంతాల్లో బాధితులతో ఆస్పత్రులు నిండిపోయాయి. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ మరింత భయపెడుతోంది. కోవిడ్‌తో అమెరికాలో గత వారం రోజుల్లో 8.5 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా, 8వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు వారం పరిశీలిస్తే.. 8.25 లక్షల మంది వైరస్ బారిన పడగా, 8వేలకుపైగా మంది మృతి చెందారు. గత వారం రోజుల్లో సగటున 60వేల మంది కోవిడ్ ఆస్పత్రుల్లో చేరారు. ఇది నవంబర్ ప్రారంభం నాటి కంటే 50 శాతం ఎక్కువగా ఉందని అమెరికా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా తొలి ఒమిక్రాన్ మరణం నమోదు కావడంతో మరింత ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు కూడా విధిస్తోంది అమెరికా సర్కార్. ఇప్పుడు ఒమిక్రాన్ మరణం సంభవించడంతో మరింత అప్రమత్తం కానుంది అమెరికా. కాగా, ప్రపంచంలో మొదటి ఒమిక్రాన్ మరణం బ్రిటన్‌లో కాగా, ఇప్పుడు రెండో మరణం అమెరికాలో చోటు చేసుకుంది. ఆమెరికాలో మాత్రం ఇది తొలి మరణం.
ఇవి కూడా చదవండి: