భారత్‌-అమెరికా వాణిజ్య సంబంధాల్లో మరో ట్విస్ట్‌.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు భారత్‌ అదరడం లేదు.. బెదరడం లేదు.. ధీటైన జవాబిచ్చేందుకు భారత్‌ రెడీ అవుతోంది. రష్యా , చైనాతో కలిసి ట్రంప్‌నకు చెక్‌ పెట్టేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆగస్టు నెలఖారులో భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పర్యటన సందర్భంగా కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.

భారత్‌-అమెరికా వాణిజ్య సంబంధాల్లో మరో ట్విస్ట్‌.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
Donald Trump

Updated on: Aug 08, 2025 | 9:08 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో వాణిజ్య చర్చలు జరపడానికి స్పష్టంగా నిరాకరించారు. సుంకాల వివాదం ఉన్నంత వరకు, ఈ విషయం ఖరారు అయ్యే వరకు భారతదేశంతో ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. సుంకాల సమస్యను పరిష్కరించే వరకు, వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఉండవని ఆయన గురువారం ఓవల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు.

భారత్‌పై సుంకాల బాంబులు ప్రయోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్దమవుతోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భారత వ్యవసాయ ఉత్పుత్తులను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో భారత్‌కు రష్యాతో పాటు చైనా అండగా నిలిచాయి. ట్రంప్‌ తీరును అటు పుతిన్‌ ఇటు జిన్‌పింగ్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ట్రంప్‌ సుంకాలను దుర్వినియోగం చేస్తున్నారని చైనా విదేశాంగశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈనెలాఖరులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌లో పర్యటించబోతున్నారు. మాస్కోలో పర్యటిస్తున్న జాతీయ భద్రతాసలహాదారు అజిత్‌ దోవల్‌ స్వయంగా ఈవిషయాన్ని ప్రకటించారు. భారత్‌పై ట్రంప్‌ సుంకాల వేళ పుతిన్‌ భారత పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా నుంచి చవగ్గా భారత్‌ ముడిచమురును దిగుమతి చేసుకుంటుందన్న నెపంతో ట్రంప్‌ భారత్‌పై అదనపు సుంకాలను విధించారు.

మరోవైపు ఆగస్టు 31న చైనాలో జరిగే SCO సమ్మిట్‌కు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. అమెరికా టారిఫ్‌లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని భారత్‌ , రష్యా , చైనా నిర్ణయించాయి. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకాలపై రగడ కొనసాగుతోంది. ప్రధాని మోదీతోపాటు అన్ని పార్టీలు ట్రంప్‌ తీరును తప్పుపడుతున్నాయి. ట్రంప్‌ బెదిరింపులకు లొంగరాదని కేంద్రానికి సూచిస్తున్నాయి.

ట్రంప్‌ విధించిన సుంకాలతో భారతీయ వస్తువుల ధరలు 50 శాతం పెరుగుతాయని, అప్పుడు భారతీయు వస్తువులను కొనడానికి ఎవరు ఇష్టపడరని అన్నారు థరూర్‌. అమెరికాపై భారత్‌ 17 శాతం సుంకాలను మాత్రమే విధిస్తోందని అన్నారు. ట్రంప్‌కి కౌంటర్‌గా అమెరికాపై భారత్‌ 50 శాతం సుంకాలు విధించాలని కోరారు. సుంకాల విషయంలో ట్రంప్‌ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందన్న అభిప్రాయంతో భారత్‌ ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..