Ukraine Russia War: ఉక్రెయిన్‌పై దాడి మాత్రమే కాదు, జీవించే హక్కుపై దాడి.. సంఘర్షణను వెంటనే ఆపండిః జెలెన్‌స్కీ

|

Mar 16, 2022 | 7:57 PM

రష్యా దూకుడు పెంచింది. దాడుల పరంపరను ముమ్మరం చేసింది. కీవ్‌ టు చెక్సీ దాకా.. ఏ ప్రాంతాన్నీ వదలడం లేదు రష్యా. భీకర దాడులతో విరుచుకుపడుతోంది పుతిన్‌ సేన. నాన్‌స్టాప్‌ వార్‌ ఉక్రెయిన్‌లో కల్లోలం సృష్టిస్తోంది.

Ukraine Russia War: ఉక్రెయిన్‌పై దాడి మాత్రమే కాదు, జీవించే హక్కుపై దాడి.. సంఘర్షణను వెంటనే ఆపండిః జెలెన్‌స్కీ
Zelenskyy
Follow us on

Ukraine Russia Crisis: రష్యా దూకుడు పెంచింది. దాడుల పరంపరను ముమ్మరం చేసింది. కీవ్‌ టు చెక్సీ దాకా.. ఏ ప్రాంతాన్నీ వదలడం లేదు రష్యా. భీకర దాడులతో విరుచుకుపడుతోంది పుతిన్‌ సేన. నాన్‌స్టాప్‌ వార్‌ ఉక్రెయిన్‌లో కల్లోలం సృష్టిస్తోంది. ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం కురుస్తోంది రష్యా. తాజాగా ఖార్కివ్‌లోని ఓ మార్కెట్‌పై క్షిపణులతో దాడి చేసింది రష్యా. ఈ దాడిలో భారీగా ఆస్తినష్టం జరిగింది. భారీ భవనాలు కుప్పకూలాయి. మరోవైపు చెర్నివ్‌లో సాధారణ ప్రజలపై కూడా కాల్పులు జరిగాయి. ఈ దాడిలో 10 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఆహారం కోసం జనం క్యూలో ఉన్న సమయంలో కాల్పులు జరిపారు. దీంతో ఎక్కడివారక్కడే కుప్పకూలారు. మరోవైపు, యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా పార్లమెంట్‌లో ప్రసంగించారు.

ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం సూర్యోదయానికి ముందే కీవ్‌లో విధ్వంసం సృష్టించింది. 15 అంతస్తుల అపార్ట్‌మెంటుపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, వందలాది మంది లోపలే చిక్కుకుపోయారు. పొడిల్‌స్కీలో మరో 10 అంతస్తుల అపార్ట్‌మెంటుపైనా ఇలాంటి దాడే జరిగింది. ఇక.. ఉక్రెయిన్‌లో హ్యాకర్ల ఆగడాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉక్రెయిన్‌ 24 టీవీ చానల్‌ను హ్యాక్ చేశారు సైబర్ కేటుగాళ్లు. లైవ్‌ టీవీ స్క్రీన్‌పై టెక్ట్స్‌ మెసెజ్‌లు ప్రత్యక్ష ప్రసారం కావడం కలకలం రేపింది. జెలెన్‌స్కీ సరెండర్‌ అవుతున్నారంటూ హ్యాకర్లు అబద్ధపు ప్రచారాన్ని చేపట్టారు. ఫేక్‌ వార్తల్ని కొట్టిపారేశారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మవద్దంటూ జెలెన్‌స్కీ వీడియో విడుదల చేశారు. లొంగిపోం.. కడవరకు పోరాడతామంటూ వీడియోలో ప్రకటించారు.

మరోవైపు, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 13వేల 500 మంది రష్యా సైనికులను చంపినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. వందల సంఖ్యలో సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. రష్యా సేనలు దాడులు ఉద్ధృతం చేస్తున్న క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐరోపాకి చెందిన మూడు దేశాల నేతలు ఉక్రెయిన్‌ పర్యటనకు వెళ్లారు. పోలండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, స్లొవేనియా దేశాల ప్రధానులు కీవ్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ప్రధాని డెనిస్‌లను కలిశారు. ఆ ముగ్గురు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు.యుద్ధం సృష్టించిన విలయానికి ఉక్రెయిన్‌ వాసుల కన్నీళ్లకు అంతు లేకుండా పోయింది. లక్షలాది మంది జనాలు దేశం సరిహద్దులు దాటేస్తున్నారు. పోలండ్‌కు భారీ ఎత్తున వలస వెళ్తున్నారు ఉక్రెయిన్‌ వాసులు. ఇప్పటిదాకా 18 లక్షల మంది పోలండ్‌ గడప తొక్కారు.

ఉక్రెయిన్‌లో మనుషుల ప్రాణాలకే దిక్కులేకుండా పోయిన వేళ.. పెంపుడు కుక్కల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. తమతో పాటే పెంపుడు జంతువుల్ని వెంటబెట్టుకెళ్తున్నారు శరణార్థులు. ప్రతి ముగ్గురిలో ఒకరు పెంపుడు కుక్కల్ని వెంటతీసుకెళ్తున్నారు. ఉక్రెయిన్‌ గగనతలం మీద నో ఫ్లయ్‌ జోన్‌ అమలు చేసేందుకు విముఖత వ్యక్తం చేసిన నాటోపై అసంతృప్తి వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. కొందరు దేశాధినేతలు రష్యాకు హిప్నటైజ్‌ అయ్యారని విమర్శించారు. నాటో కూటమిలో చేరబోమని మరోసారి స్పష్టం చేశారు జెలెన్‌స్కీ. ఈ వాస్తవాన్ని ప్రజలంతా అంగీకరించాలని కోరారు.

ఇదిలావుంటే రష్యాతో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ సమయంలో, US చట్టసభ సభ్యులందరూ జెలెన్‌స్కీని నిలబడి అభినందించారు. మాకు యుద్ధం వద్దు అని జెలెన్‌స్కీ పార్లమెంటు సాక్షిగా చెప్పారు. యుద్ధాన్ని ఆపాలి. మేము యుద్ధాన్ని ఆపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాము. రష్యా నిరంతరం క్షిపణులను దాడులకు ఉపయోగిస్తోంది. జెలెన్‌స్కీ అమెరికాకు రెండో ప్రపంచయుద్ధాన్ని గుర్తు చేస్తూ ఉక్రెయిన్ విధ్వంసానికి సంబంధించిన వీడియోను యూఎస్ పార్లమెంట్‌లో చూపించారు. మా హక్కులపై దాడి జరిగిందని జెలెన్‌స్కీ అన్నారు. ఈ సందర్భంగా రష్యాపై అమెరికా మరింత కఠిన ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. అమెరికా కంపెనీలు కూడా రష్యాను విడిచిపెట్టాలని ఆయన కోరారు.

జెలెన్‌స్కీ తన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు అమెరికా చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. నేటి కాలంలో నాయకుడిగా ఉండటం అంటే మీరు శాంతికి నాయకత్వం వహిస్తారని జెలెన్‌స్కీ అన్నారు. రష్యాకు ఉన్న అన్ని ఓడరేవులను అమెరికా మూసివేయాలని ఆయన అన్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఎప్పటికీ లొంగిపోదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు మన దేశ భవితవ్యాన్ని నిర్ణయిస్తున్నారన్నారు. ఇది మనపై, మన నగరాలపై దాడి మాత్రమే కాదు, మన జీవించే హక్కుపై దాడి. అమెరికా ప్రజలకు స్వాతంత్ర్యానికి సంబంధించిన కలలు ఉన్నట్లే ఉక్రెయిన్ ప్రజల కలలు కూడా ఉంటాయని జెలెన్‌స్కీ అన్నారు.

అమెరికాలోని ప్రజల సాధారణ జీవన విధానం ఏమిటో ఉక్రెయిన్‌లోని మా ప్రజలకు మేము కోరుకుంటున్నామని జెలెన్‌స్కీ అన్నారు. అమెరికాపై దాడి జరిగిన 1941 ఉదయం గుర్తుకు తెచ్చుకోండి, అమెరికాపై దాడి జరిగిన సెప్టెంబర్ 11ని గుర్తుంచుకోండి. రష్యా చేస్తున్న దాడులను కూడా ఆపలేకపోతున్నాం. ఇప్పటివరకు, రష్యా ఉక్రెయిన్‌పై 1000 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. దాడికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. మాకు మరియు మీకు సహాయం చేయమని నేను మరోసారి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని జెలెన్‌స్కీ చెప్పారు. మరికొన్ని ఆంక్షలు ఇంకా అవసరం. యుక్రెయిన్ అధ్యక్షుడు ఈ రోజు ప్రపంచానికి యుద్ధాన్ని ఆపడానికి మార్గాలు లేవని అన్నారు. అందుకే కొత్త కూటమి కావాలి. ఈ సంఘర్షణను 24 గంటల్లో ఆపాలని అంటూ అమెరికా పార్లమెంటును వేడుకున్నారు జెలెన్‌స్కీ.

Read Also….

Viral Video: లైవ్ జరుగుతుండగా నిరసన.. మహిళా జర్నలిస్ట్ కు 15 ఏళ్ల జైలుశిక్ష.. కారణమేంటంటే

Ram Charan: మరోసారి మంచి మనసు చాటుకున్న రామ్ చరణ్.. ఉక్రెయిన్ లోని తన సెక్యూరిటీ గార్డుకి మనీ పంపిన చెర్రీ..