
పాకిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్ అయిన బలూచిస్థాన్ మరోసారి రక్తసిక్తమైంది. బలూచిస్థాన్‌లో గత 40 గంటలుగా భీకర పోరు సాగుతోంది. బలూచ్ వేర్పాటువాద గ్రూపులు ఏకకాలంలో జరిపిన దాడులతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. 40 గంటలుగా సాగుతున్న ఈ భీకర పోరులో ఇప్పటివరకు 145 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు బెలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఆదివారం క్వెట్టాలో వెల్లడించారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో హింస చెలరేగడం ఇదే తొలిసారి. ఈ ఘర్షణల్లో 31 మంది పౌరులు, 17 మంది భద్రతా సిబ్బంది కూడా మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యం, ISI, పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా 11 నగరాల్లో భారీ దాడులు చేస్తోంది. రాజధాని క్వెట్టా శివార్లలో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొంది. అక్కడ బలూచ్ యోధులు అవామ్ బ్యాంక్ నుంచి 3.8 మిలియన్ల రూపాయలను దోచుకుని, ఆపై దానిని తగలబెట్టారు. రెండు రోజుల్లో హతమైన మిలిటెంట్ల సంఖ్య 145కు చేరింది. ప్రస్తుతం 11 ప్రాంతాల్లో ఇంటర్నెట్, రైలు సర్వీసులను నిలిపివేశారు.
బలూచ్ పోరాటంలో ఫిదాయిన్ మహిళా ఆత్మాహుతి దళాలు కీలకంగా మారాయి. 2023లో BLAలో చేరిన ఆసిఫా మెంగల్ అనే 24 ఏళ్ల యువతి, జనవరి 31న నోష్కీలోని పాక్ గూఢచారి సంస్థ ISI ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని కార్ బాంబు పేల్చింది. ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తెలిపింది. గ్వాదర్ ఫ్రంట్‌లో మరో మహిళా ఫిదాయీ హవా బలూచ్ కూడా పాక్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందిందని పేర్కొంది. అయితే.. హవా బలూచ్ అనే ఆ యువతి పాక్ సైనికులకు చుక్కలు చూపించింది. బలూచ్ పోరాట యోధులకు ఆమె ప్రేరణ ఇవ్వడంతోపాటు.. గన్ పట్టుకోని.. సైనికులపై కాల్పులు జరుపుతూ భయపెట్టేది.. ఈమెకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి..
అయితే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీని రెచ్చగొట్టి పాక్‌లో అశాంతిని భారత్ సృష్టిస్తోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. కానీ ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తోసిపుచ్చారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రతీసారి భారత్‌పై నిందలు వేసే బదులు.. బలూచిస్థాన్ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంపై పాక్ దృష్టి పెట్టాలని జైస్వాల్ ఘాటుగా సూచించారు. ఇస్లామాబాద్ తన అంతర్గత వైఫల్యాల నుంచి ప్రపంచం దృష్టి మళ్లించేందుకు భారత్ పై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..