Boycott Turkey: ఇండియాలో బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌.. స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు! ఏమన్నాడంటే..?

భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ప్రకటించడంతో భారతదేశంలో టర్కీ వస్తువుల బహిష్కరణ కార్యక్రమం ముమ్మరమైంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పాకిస్థాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి టర్కీ ప్రయత్నిస్తున్నప్పటికీ, పాకిస్థాన్‌కు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.

Boycott Turkey: ఇండియాలో బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌.. స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు! ఏమన్నాడంటే..?
India Turkey

Updated on: May 14, 2025 | 4:57 PM

భారత్‌, పాకిస్థాన్‌ ఉద్రిక్తతల మధ్య టర్కీ(తుర్కియో) పాక్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో ఆ దేశ నుంచి దిగుమతి అయ్యే వస్తువులను బహిష్కరించాలని చాలా మంది భారతీయులు స్వచ్ఛందంగానే ఒక క్యాంపెయిన్‌ మొదలుపెట్టారు. ప్రస్తుతం బాయ్‌కాట్‌ టర్కీ అనే స్లోగన్‌ సోషల్‌ మీడియాలో కూడా బలంగా వినిపిస్తుంది. భారతీయ పండ్ల వ్యాపారులు టర్కీ యాపిల్స్‌ కాకుండా ఇతర దేశాల యాపిల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ స్పందించారు. ఇండియాలో బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌ రన్‌ అవుతున్నా.. వెనక్కి తగ్గదేది లేదంటూ మరోసారి పాకిస్థాన్‌ తమ మద్దతు కొనసాగుతుందంటూ ప్రకటించాడు. భారత్‌, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ఎర్డోగన్ స్వాగతించినప్పటికీ అతను పాకిస్థాన్‌ టర్కీ మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నాడు.

“పాకిస్తాన్ సోదర ప్రజలకు మా మద్దతును బహిరంగంగా ప్రకటిస్తూనే, చాలా ప్రమాదకరమైన స్థాయికి పెరిగిన ఉద్రిక్తతను తగ్గించడానికి మేం తీవ్ర ప్రయత్నాలు చేసాం” అని వెల్లడించాడు. రాబోయే కాలంలో ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని సలహా ఇస్తూ పాకిస్తాన్‌కు టర్కీ చేసిన “స్నేహపూర్వక హెచ్చరిక”ను కూడా ఆయన పునరుద్ఘాటించారు. ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో “నా ప్రియమైన సోదరుడు షెహబాజ్‌కు.. ప్రపంచంలోని చాలా తక్కువ దేశాలు మాత్రమే ఆస్వాదిస్తున్న తుర్కియే, పాకిస్తాన్ మధ్య సోదరభావం నిజమైన స్నేహానికి ఉత్తమ ఉదాహరణలలో ఒకటి. తుర్కియేగా, పాకిస్తాన్ శాంతి, ప్రశాంతత, స్థిరత్వానికి మేం చాలా ప్రాముఖ్యతనిస్తాం. వివాదాలను పరిష్కరించడంలో చర్చలు, రాజీకి ప్రాధాన్యతనిచ్చే పాకిస్తాన్ వివేకవంతమైన, ఓపికగల విధానాన్ని మేం అభినందిస్తున్నాం. గతంలో, భవిష్యత్తులో మాదిరిగానే మంచి, చెడు సమయాల్లో మేం మీ పక్షాన ఉంటాం. సోదర పాకిస్తాన్‌ను నా అత్యంత హృదయపూర్వక ప్రేమతో అభినందిస్తున్నాను.” అని రాసుకొచ్చాడు.

అంతకుముందు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ “నా ప్రియమైన సోదరుడు అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పాకిస్తాన్‌కు ఇచ్చిన బలమైన మద్దతు, అచంచలమైన సంఘీభావం నన్ను తీవ్రంగా కదిలించింది. టర్కీతో దాని దీర్ఘకాల, కాలపరీక్షకు గురైన, శాశ్వతమైన సోదర సంబంధాలకు పాకిస్తాన్ గర్విస్తోంది.” అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)లో కీలక స్థానాన్ని పొందాలని కోరుకునే టర్కీ, భారతదేశానికి సంబంధించిన విషయాలలో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చింది. ఇస్లామిక్ దేశాలలో తన స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని టర్కీ భావిస్తోంది. భారత్‌, పాక్‌ వివాదంలో టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడంతో భారతదేశంలో ‘టర్కీని బహిష్కరించండి’ క్యాంపెయిన్‌ నడుస్తోంది. పాకిస్తాన్‌కు డ్రోన్‌లు సహా ఆయుధ వ్యవస్థలను అందించడంపై టర్కీ దేశంపై భారత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి