మయన్మార్ మళ్ళీ ఉద్రిక్తం, పోలీసు కాల్పుల్లో ఇద్దరి మృతికి నిరసనగా వేలాది ఆందోళనకారుల ప్రదర్శన
మయన్మార్ ఆదివారం మళ్ళీ ఉద్రిక్తమైంది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరి మృతిని నిరసిస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చి భారీ ప్రదర్శన నిర్వహించారు. కాల్పుల్లో..
మయన్మార్ ఆదివారం మళ్ళీ ఉద్రిక్తమైంది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరి మృతిని నిరసిస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చి భారీ ప్రదర్శన నిర్వహించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఓ యువతి మృతదేహానికి వారు అంత్యక్రియలు చేశారు. ఈమె చికిత్స పొందిన ఆసుపత్రికి వందలాది మంది కార్లు, బైక్ లలో చేరుకొని,,సైన్యానికి నిరసనగా నినాదాలు చేశారు. అటు సైన్యం అరెస్టు చేసిన ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని వెంటనే విడుదల చేయాలనీ వారు డిమాండ్ చేశారు. ఈ సైనిక ప్రభుత్వం గద్దె దిగేవరకు పోరాడుతామని నిరసనకారులు హెచ్చరించారు. కాగా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నవారిపై పోలీసులు కాల్పులు జరపడాన్ని ఖండిస్తూ బ్రిటీష్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ ట్వీట్ చేశారు. ఇప్పటికే మయన్మార్ లో సైనిక ప్రభుత్వానికి తాము సాయాన్ని నిలిపివేశామని, మరిన్ని ఆంక్షలు విధించడానికి యోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సింగపూర్, యూఎస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరిస్ మయన్మార్ పరిణామాలను తీవ్రంగా ఖండించారు.
కెనడా, న్యూజిలాండ్ దేశాలు కూడా మయన్మార్ పై ఆంక్షలు విధించాయి. ఈ దేశంలో మిలిటరీ ప్రభుత్వం ఈ నెల 1 న కుట్ర పూరితంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. గత నవంబరు ఎన్నికల్లో ప్రజాస్వామ్య బధ్దంగా ఎన్నికైన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నేత ఆంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకుంది. దీంతో దేశంలో సమ్మెలు, నిరసనలు, ఆందోళనలతో ప్రజలు సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టారు.
Also Read: