మిస్టీరియస్‌ డెత్.. కొలంబియాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి!

|

Sep 24, 2023 | 7:15 AM

కొలంబియాలో తెలుగు విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్నేహితురాలి జన్మదిన వేడుకలకు హాజరైన తెలుగు విద్యార్థి కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత నాలుగు రోజులకు విద్యార్ధి మృత దేహం లభ్యమైంది. అనుమానాస్పద రీతిలో విద్యార్ధి మృతి చెందిన ఘటన మంగళవారం (సెప్టెంబర్‌ 19న) మృతుడి కుటుంబ సభ్యులకు తెలియగా.. ఆ విషయం ఆలస్యంగా సెప్టెంబర్‌ 23న వెలుగులోకొచ్చింది. అసలేం జరిగిందంటే..

మిస్టీరియస్‌ డెత్.. కొలంబియాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి!
Bethapudi Sudhir Kumar
Follow us on

మైలవరం, సెప్టెంబర్‌ 24: కొలంబియాలో తెలుగు విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్నేహితురాలి జన్మదిన వేడుకలకు హాజరైన తెలుగు విద్యార్థి కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత నాలుగు రోజులకు విద్యార్ధి మృత దేహం లభ్యమైంది. అనుమానాస్పద రీతిలో విద్యార్ధి మృతి చెందిన ఘటన మంగళవారం (సెప్టెంబర్‌ 19న) మృతుడి కుటుంబ సభ్యులకు తెలియగా.. ఆ విషయం ఆలస్యంగా సెప్టెంబర్‌ 23న వెలుగులోకొచ్చింది. అసలేం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన బేతపూడి కేథరీన్, దేవదాసుకు సుదీర్‌కుమార్‌ దంపతలు కుమారుడు బేతపూడి సుదీర్‌కుమార్‌ అలియాస్‌ జోషి (34) ఉన్నత విద్యాభ్యాసం కోసం 2018లో స్పెయిన్‌ వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్‌ లే డే జైన్‌లో ఎంఎస్‌లో టెలీ కమ్యూనికేషన్‌ విభాగంలో చేరాడు. అయితే కరోనా కారణంగా చదువు సవ్యంగా సాగలేదు. కొన్ని సబ్జెక్ట్‌లు మిగిలిపోవడంతో అక్కడే ఉండి పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకుంటూ ఎంఎస్‌ పూర్తి చేసేందుకు జోషి ప్రయత్నిస్తున్నాడు. అదే యూనివర్సిటీలో జోషితోపాటు చదువుతోన్న కొలంబియాకు చెందిన యువతి జెస్సికాతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో జెస్సికా సెప్టెంబర్‌ 15వ తేదీన తన పుట్టిన రోజు వేడుకల నిమిత్తం జోషిని ఆహ్వానించింది. దీంతో స్నేహితురాలి బర్త్‌డే కోసమని జోషి స్పెయిన్‌ నుంచి కొలంబియా రాజధాని బోగోటో వెళ్లాడు.

అక్కడి నుంచి రియో బ్లాంకోలో ఉన్న జెస్సికా ఇంటికి వెళ్లాడు. అలా వెళ్లిన జోషి ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. అక్కడ జన్మదిన వేడుకల అనంతరం ఏం జరిగిందో ఎవరికీ తెలియరాలేదు. ఇంతలో నాలుగు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్‌ 19వ తేదీన (మంగళవారం) తెల్లవారుజామున జోషి మృతి చెందిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు కొలంబియాలోని జెస్సీకా సమాచారం అందించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న జి.కొండూరులోని జోషి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎదిగిన కుమారుడు ఉన్నత ఉద్యోగంతో తిరిగొస్తాడనుకుంటే తమ ఆశలన్నీ ఆవిరయ్యాయంటూ గుండెలు బాదుకున్నారు.

ఇవి కూడా చదవండి

స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు హాజరైనట్లు తల్లిదండ్రులకు చివరి ఫోన్‌కాల్‌ చేశాడు. స్నేహితురాలి జన్మదిన వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సైతం తమతో వాట్సాప్‌లో పంచుకున్నాడని, తమ బిడ్డ ఎందుకు చనిపోయాడో తెలియడం లేదని, కారకులను శిక్షించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమ కుమారుడిని జన్మదిన వేడుకల పేరుతో ఇంటికి రప్పించి కావాలని హత్య చేసి ఉంటారని జెస్సికాపై అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమ కుమారుడి భౌతికకాయం తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మరోవైపు జెస్సికా చెప్పిన కారణం మరోలా ఉంది.. జన్మదిన వేడుకల్లో భాగంగా తాగిన డ్రింక్‌ వల్ల తనకు మత్తుగా ఉందని, తర్వాత మాట్లాడతానని తమతో చివరిగా ఫోన్‌లో మాట్లాడాడని, అవే చివరిమాటలని అనంతరం తన ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు చెబుతోంది.

మరిన్ని ఆంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.