
Vemula Nithin: కృషి, పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చని నిరూపించాడు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వేముల నితిన్. పది రోజుల వ్యవధిలోనే రెండు ఎత్తైన పర్వాతాలను అధిరోహించి శభాష్ అనిపించుకుంటున్నాడు. తాను చేస్తున్న పనికి సంబంధం లేకపోయినప్పటికీ.. తనలో ఉన్న ఆసక్తితో ప్రతిభను చాటుకున్నాడు. హైదరాబాద్‌లోని సమాచార, పౌరసంబందాలశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వేముల నితిన్.. పర్వతారోహాణ చేయాలనుకున్నాడు. అందుకు అనుగుణంగా సాధన చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆఫ్రికాలోని 19,341 అడుగులు ఎత్తైన కిలిమంజారో పర్వత శిఖరాన్ని ఆగష్టు 14న చేరుకుని జాతీయ జెండాను అవిష్కరించారు నితిన్.
ఆ తర్వాత యూరప్‌లోని 18,510 అడుగుల అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని ఆగష్టు 24న విజయవంతంగా అధిరోహించారు. పది రోజుల వ్యవధిలోనే రెండు పర్వతాలను అధిరోహిచండం విశేషం. ఎల్బ్రస్ పర్వతం రష్యా, ఐరోపాలో ఎత్తైన ప్రముఖ శిఖరం. తనకు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు నాలుగు రోజులు పట్టిందన్నారు వేముల నితిన్. ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనేది తన లక్ష్యమని ఆయన తెలిపారు.