ఎటు చూసినా శవాల కుప్పలు… కాల్పుల మోతతో క్షణక్షణం.. భయం.. భయం..!
సిరియాలో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. కోస్టల్ నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అలావైట్లు పేరు చెప్తే చాలు అక్కడ గన్స్‌కు పని చెప్తున్నారు. అసద్‌ను తరిమేసి.. అధికారం చేపట్టిన కొత్త అధ్యక్షుడికి ఇప్పుడు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అసలీ అంతర్యుద్ధానికి కారణం ఏంటి..?

సిరియాలో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. కోస్టల్ నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. సిరియాలో అంతర్యుద్ధం ఏ స్థాయికి చేరిందో అక్కడి దృశ్యాలు చూస్తే అద్దం పడుతోంది. రాత్రింబవళ్లు తేడా లేకుండా.. ప్రతీకార దాడులతో రావణకాష్టంలా రగిలిపోతుంది సిరియా. 48 గంటల్లో 745 ప్రతీకార హత్యలు జరిగాయి. చాలా ప్రాంతాల్లోని మైనార్టీలైన అలావైట్లను అణచివేసే దిశగా ఈ దాడులు జరుగుతున్నాయి. అసద్ మద్దతుదారులపై హెచ్‌టీఎస్ ప్రభుత్వానికి అనుకూల సాయుధులు దాడులు చేయడంతో ఘర్షణలు మొదలయ్యాయి.
అసద్ మద్దతుదారులను వెతికి మరీ చంపుతున్నట్లు బాధితులు చెప్తున్నారు. వీధుల్లో శవాలు పడి ఉన్నాయని.. మగవారిని ఇళ్ల మీదకు తీసుకెళ్లి కాల్చేస్తున్నారని అంటున్నారు. కోస్టల్ నగరమైన లటాకియాలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ తీర ప్రాంత నగరంలో అలావైట్లు అత్యధికంగా ఉంటారు. ప్రస్తుతం అక్కడే అత్యధిక హింస చోటు చేసుకుంటోంది. వారంలో రోజుల్లో 973 మంది హత్యకు గురయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హింసపై తీర ప్రాంత నగరాల్లో భారీ నిరసనలు తెలుపున్నారు. తమకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిరియాలో అలావైట్లు మతపరమైన మైనారిటీలు. దేశ జనాభాలో వారు 12శాతం ఉన్నారు. వారి మూలాలు షియా ముస్లింలలో ఉన్నాయి. అలావైట్లు.. సిరియా తీర ప్రాంత నగరాలైన లటాకియా, టార్టస్‌లలో అధికంగా ఉంటారు. సిరియాను ఐదు దశాబ్దాలపాటు పాలించిన అసద్ కుటుంబం అలావైట్ల వర్గానికి చెందినదే. 2024 డిసెంబరు వరకు సిరియాలో వీరిదే ఆధిపత్యం. అసద్ అండ చూసుకుని.. ఎన్నో క్రూరమైన పనులు చేశారు. సైన్యంలోని కొందరు. ఆడ, మగ తేడా లేకుండా రాజధాని డమాస్కస్‌లోని సైద్నాయ జైలుకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. సిరియా వధశాలగా పిలిచే ఈ జైలుకు వెళ్లారంటే.. ప్రాణాలతో తిరిగి వచ్చేది ఉండదు. అంతేకాదు.. ఆడవారిపై ఆకృత్యాలు, నడిరోడ్డుపై కాల్చివేతలు లాంటి క్రూరత్వాలు చూసి.. తిరుగుబాటు మొదలైంది. అసద్ పాలన అంతమై.. చివరికి విదేశాలకు పారిపోయేలా చేసింది. గతంలో చిత్రహింసలకు గురిచేసిన వారికి మద్దతు తెలిపిన అలావైట్లను ఇప్పుడు తిరుగుబాటు దారులు దారుణంగా కాల్చేస్తున్నారు.
తాజాగా చెలరేగిన హింసపై దర్యాప్తు చేస్తామని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్‌షార్రా తెలిపారు. అసద్ వర్గానికి చెందినవారు, విదేశీ శక్తుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ప్రస్తుతం తాము సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నామని… సరికొత్త ముప్పును తాము ఎదుర్కుంటున్నామని అన్నారు. మొత్తంగా సిరియా ఇప్పుడు దాడులు.. ప్రతీకార దాడులతో.. రావణకాష్టంలా మండుతోంది. చిన్న తూటా శబ్దం వినిపించినా.. దేశం మొత్తం ఉలిక్కి పడుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..