Srilanka Crisis: శ్రీలంక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. లంక ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధికధరలపై ఆగ్రహజ్వాల రాజపక్సే ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. ఆందోళనల వెనుక తీవ్రవాద శక్తుల హస్తముందని అధ్యక్షుడు గొటబయ రాజపక్సే(Gotabaya Rajapaksa) ఆరోపించారు. తమ దేశాన్ని ఆదుకోవాలని ఐఎంఎఫ్(IMF)తో పాటు చైనా , భారత్(India)కు విజ్ఞప్తి చేశారు. అధికధరలను అదుపు చేయడంలో విఫలమైన దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే తప్పంతా ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన నివాసం దగ్గర జరిగిన అల్లర్ల వెనుక తీవ్రవాదుల హస్తముందని అధ్యక్షుడు రాజపక్సే ఆరోపించారు. తీవ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.
అల్లర్ల వెనుక ఉన్న తీవ్రవాద గ్రూపులను గుర్తించినట్టు రాజపక్సే తెలిపారు. మరో ఆర్ధికసంక్షోభం నుంచి గట్టెక్కించాలని శ్రీలంక ప్రభుత్వం IMFను వేడుకుంది. శ్రీలంక అభ్యర్ధనను పరిశీలిస్తున్నామని IMF తెలిపింది. సంక్షోభం నుంచి గట్టెక్కించాలని భారత్‌తో పాటు చైనా ప్రభుత్వాలను కూడా వేడుకున్నారు అధ్యక్షుడు రాజపక్సే. అధ్యక్ష భవనం దగ్గర అల్లర్ల కేసులో 45 మందిని కొలంబో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అమాయకులను అరెస్ట్ చేసి టార్చర్ చేస్తున్నారని శ్రీలంక విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజపక్సే సోదరుల వల్లే దేశానికి ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజపక్సేకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి. అధ్యక్ష భవనం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఓవైపు నిత్యావసర వస్తువులు చుక్కలను తాకడంతో పాటు శ్రీలంకలో కరెంట్ సంక్షోభం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 13 గంటల పాటు విద్యుత్ కోతలు విధించడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్లలో నీళ్లు లేవని పరిస్థితిని ప్రజలు అర్ధం చేసుకోవాలని శ్రీలంక ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
Read Also… Andhra Pradesh: ఏసీలు, వాషింగ్ మిషన్లు వాడొద్దు.. ప్రజలకు AP SPDCL విజ్ఞప్తి