Sri Lanka Crisis: శ్రీ లంకలో నెలల తరబడి సంక్షోభం కొనసాగుతోంది. ఓ వైపు దేశంలో ఆర్థిక సంక్షోభం.. ఆకాశాన్నంటుతున్నధరలు, ఇంధన, విద్యుత్, నిత్యావసరాల కొరత తారాస్థాయికి చేరుకున్నాయి. మరోవైపు ప్రజల నిరసనలు లంక రాజకీయ సంక్షోభానికి దారి తీశాయి. అత్యవసర పరిస్థితి.. నిత్యం కర్ఫ్యూలతో అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది. కాగా ఈ పరిస్థితులపై శ్రీలంకకు చెందిన ‘మానికే మాగే హితే’ (Manike Mage Hithe) సింగర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన మాతృదేశంలో నెలకొన్న పరిస్థితులపై ఇంటర్నెట్ సెన్సేషన్ యోహాని డిలోక డి సిల్వా (Yohani Diloka de Silva) స్పందించింది. మనికే మగే హితె సాంగ్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ 28 ఏళ్ల సింగర్, ఆ తర్వాత భారత్ నుంచి ఆమెకు అవకాశాలు రాగా.. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. ఇక్కడి సంగీతదర్శకులతో పని చేస్తూ.. మరోపక్క మ్యూజిక్ షోలు నిర్వహిస్తున్నారు.
శ్రీ లంకలో సంక్షోభం మొదలయ్యాక..ఆమెకు స్వదేశానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం శ్రీలంక పరిస్థితులపై స్పందించిన యోహానీ.. ప్రస్తుతం నా దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. దానికి అందరి సాయం అవసరం ఉంది… అది ఆర్థిక సాయమే కానక్కర్లేదు.. ఏ రూపంలో సాయం అందించినా చాలు.. అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు నా గొంతు, నాకు దక్కిన పేరు ప్రతిష్టలతో నా దేశానికి సాయం చేయాలనుకుంటున్నానన్నారు. తాను మౌనం వీడి.. తన దేశం తరపున అంతర్జాతీయ వేదికలపై తన దేశానికి మద్ధతుగా తన గళం వినిపించాలనుకుంటున్నాఅని తెలిపారు. అంతేకాదు తన కుటుంబం అంతా అక్కడే ఉంది. వాళ్ల క్షేమం కోరుకోవడం తప్ప ఇక్కడుండి ఏం చేయలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా లంక ప్రజలు పడుతున్న అవస్థల దృశ్యాలు చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందన్నారు యోహాని. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. లంక ప్రజలకు సాయం అందించేందుకు ఆమె విరాళాల సేకరణ సైతం చేపట్టారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..