ఒక కాన్పులో నలుగురు, ఐదుగురు పిల్లలు పుట్టారని అప్పుడప్పుడు మీరు వినే ఉంటారు. కానీ అంతకంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టారని ఎప్పుడైన విన్నారా.. ? ఇప్పుడు వినండి.. ఓ మహిళ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళకు 10 మంది పిల్లలు పుడతారనే విషయం కాన్పుకు ముందు తెలియదు. వైద్యులు తీసిన స్కానింగ్ రిపోర్టులో మొదట ఆరుగురు పిల్లలుపుడతారని తెలిపారు. మళ్లీ స్కానింగ్‌ల తర్వాత 8 మంది పిల్లలు పుడతారని తెలిపారు. అయితే వైద్యుల రిపోర్టులను అధిగమించి ఆమె 10 మంది పిల్లలకు జన్మనివ్వడం గమనార్హం. అయితే ఒకేసారి ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడం వైద్యులు సైతం ఆశ్యర్యపోయారు.
దక్షిణాఫ్రికాలో ప్రిటోరియా అనే నగరానికి చెందిన గోసియమి తమారా సితోలే అనే 37 ఏళ్ల మహిళకు ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలకు జన్మించారు. మే నెలలో మొరాకోకు చెందిన మహిళ తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. అత్యధిక మంది పిల్లలకు జన్మనిచ్చిన ఆమె రికార్డును సృష్టించారు. సితోలే ప్రటోరియా నగరంలో ఉన్న రిటైల్ స్టోర్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. అయితే ఆమె గతంలోనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం వారి వయసు ఆరేళ్లు. కాగా ప్రెగ్నెన్సీ సమయంలో తనకు చాలా ఇబ్బందిగా ఉండేదని సితోలే చెప్పుకొచ్చింది. పుట్టుబోయే పిల్లలపై కూడా తను చాలా టెన్షన్‌కు గురైనట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం పుట్టిన పది మంది పిల్లలు కూడా ఆరోగ్యంగానే పుట్టారని, కాకపోతే వారిని కొద్ది రోజుల పాటు ఇంక్యూబెటర్‌లో ఉంచాలని వైద్యులు చెప్పినట్లు ఆమె భర్త మీడియాకు వివరించారు.