ఆఫ్గనిస్తాన్ లో పరిస్థితి త్వరలో మెరుగు పడవచ్చునని ఆశిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితిలో భారత్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఆఫ్గనిస్తాన్ లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని…అక్కడి మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులను సంబంధిత పక్షాలు గౌరవిస్తాయని ఆశిస్తున్నామని వెల్లడించింది. ఆఫ్ఘన్ లో విస్తృత ప్రాతిపదికపై ఏర్పడే ఓ ప్రాతినిధ్య వ్యవస్థ అందరికీ సమ్మతం కాగలదని ఇండియా వ్యాఖ్యానించింది. ఆయా పక్షాలు హ్యుమానిటీ, సెక్యూరిటీ పట్ల శ్రద్ధ వహించగలవని నమ్ముతున్నామని పేర్కొంది. కాగా కమర్షియల్ విమానాల పునరుద్ధరణ జరిగిన వెంటనే కాబూల్ నుంచి మొదట హిందువులు, సిక్కుల తరలింపునకు ప్రాధాన్యం ఇస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆఫ్ఘన్ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో విస్తృత చర్చ జరగగలదని భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడి పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇలా ఉండగా కాబూల్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు విదేశాంగ శాఖ ఓ ప్రత్యేక విభాగాన్ని (సెల్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు గత రాత్రి ఓ ప్రకటన విడుదల చేస్తూ కొన్ని రోజులుగా కాబూల్ లో పరిస్థితి చాలా దిగజారిందని, ప్రస్తుతం మరింత దారుణంగా ఉందని పేర్కొంది. ఈ కారణంగా తాము అత్యవసర కాంటాక్ట్ నెంబర్లను సర్క్యులేట్ చేస్తున్నామని, ఇండియాకు రాగోరిన భారతీయులంతా ఈ నెంబర్లను సంప్రదించవచ్చునని తెలిపింది. వారి తరలింపునకు సుముఖంగా ఉన్నట్టు ఈ ప్రకటన వెల్లడించింది. అనంతరం ఈ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. అక్కడి సిక్కులు, హిందువుల భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. వారి భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు అడ్వైజరీలను జారీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. కాగా కాబూల్ లో ఇంకా సుమారు 300 మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి సిక్కులు నిన్న ఓ గురుద్వారాలో తలదాచుకున్నారు. కాబూల్ విమానాశ్రయం ఇంకా రద్దీగానే ఉంటోంది. తాలిబన్లు..ప్రజలనుంచి ఆయుధాలను ‘లాగేసుకుంటున్నట్టు’ వార్తలు అందుతున్నాయి. ఇక మీకు రక్షణ ఎందుకని వారు ఆయుధాలను సేకరిస్తున్నారని తాలిబన్ల అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు.. ఆఫ్ఘన్ లో పరిస్థితికి తాము కారణం కాదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. బలగాల ఉపసంహరణ సబబేనని ఆయన అన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్ ఫోన్..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.
ఐసీఐసీఐ బంపర్ ఆఫర్… ఐటీ రిటర్న్స్ పత్రాలు లేకపోయినా హౌస్ లోన్ గ్యారంటీ..!:ICICI Home Finance Video.