
అలర్ట్.. అలర్ట్.. మరోసారి యుద్ధం ముదురుతోంది. దాడులు తీవ్రరూపం దాల్చాయి.. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. ఎటు దారి తీస్తుందో అన్న ఆందోళన కలుగుతోంది.. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సౌదీ అరేబియాపై హౌతీలు క్షిపణి దాడులు చేయడం సంచలనంగా మారింది. సౌదీ రాజధాని రియాద్ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. అరామ్‌కో చమురు క్షేత్రంపై దాడులు చేశారు.. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉద్ధృతం చేయడం ఆందోళనకరంగా మారింది.. ఈ దాడులతో రాజధాని రియాద్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దట్టమైన పొగ, మంటలు చెలరేగుతున్న దృశ్యం కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హౌతీలు సౌదీపై దాడులు చేయడాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఖండించింది. ఈ దాడులు వివాదాన్ని మరింత విస్తృతం చేయడంతోపాటు సముద్రయాన, అంతర్జాతీయ వాణిజ్య భద్రతకు పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వెంటనే.. విరమించుకోవాలని సూచించింది. కాగా.. హౌతీల దాడులను సౌదీ దళాలు తిప్పికొట్టాయి.. సౌదీ అరేబియాకు తుర్కియే సైనిక మద్దతు ప్రకటించింది.
ఇదిలాఉంటే.. ఇరాన్ ‘కోడ్ 100’ అత్యవసర అలర్ట్ ప్రకటించింది. ఇరాన్ సాయుధ బలగాలు, IRGC, భద్రతా దళాలకు అత్యున్నత స్థాయి సన్నాహక ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితి తీవ్రతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంప్ డేవిడ్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని వైట్ హౌస్‌కు చేరుకున్నారు. US పర్యటనను మధ్యలోనే ముగించుకుని ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు అత్యవసరంగా ఇజ్రాయెల్ తిరుగుపయనమయ్యారు. సౌదీ అరేబియాలో ఉన్న తమ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఇటలీ ప్రభుత్వం ఆదేశించింది.
అమెరికా పౌరులకు విదేశాంగ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. విమానాల రద్దు, వైమానిక మార్గాల మూసివేతకు అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని అమెరికన్లకు సూచనలు చేసింది. సౌదీ అరేబియా, పౌర విమానాశ్రయాలే లక్ష్యంగా హూతీ తిరుగుబాటుదారుల దాడులు పెరగడంతో.. మధ్యప్రాచ్య పర్యటనను పునరాలోచించాలని విదేశాల్లో ఉన్న అమెరికన్లకు వైట్ హౌస్ పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాలు, వ్యాపార సంస్థలపై ఇరాన్ దాడి చేసే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచలను చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..