AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine: రష్యా చెలగాటం యావత్‌ ప్రపంచానికి ప్రాణ సంకటం.. యుద్ధం మరో వరల్డ్‌వార్‌గా మారుతుందా?

ప్రపంచవ్యాప్తంగా అందరినీ యుద్ధ భయం వెంటాడుతోంది. అమెరికా హెచ్చరికలను రష్యా లెక్కచేయలేదు. నాటో దేశాల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధంతో.. దేనికైనా సిద్ధమంటూ తెగింపు ధోరణి ప్రదర్శిస్తోంది.

Russia-Ukraine: రష్యా చెలగాటం యావత్‌ ప్రపంచానికి  ప్రాణ సంకటం.. యుద్ధం మరో వరల్డ్‌వార్‌గా మారుతుందా?
Russia Ukraine Crisis
Balaraju Goud
|

Updated on: Feb 24, 2022 | 1:08 PM

Share

Russia-Ukraine War:  ప్రపంచవ్యాప్తంగా అందరినీ యుద్ధ భయం వెంటాడుతోంది. అమెరికా(America) హెచ్చరికలను రష్యా(Russia) లెక్కచేయలేదు. నాటో దేశాల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఉక్రెయిన్‌(Ukraine)పై యుద్ధంతో.. దేనికైనా సిద్ధమంటూ తెగింపు ధోరణి ప్రదర్శిస్తోంది. ఉక్రెయిన్‌లో సైనిక స్థావరాలు లక్ష్యంగా మిస్సైల్స్‌ దూసుకెళ్తున్నాయి. ఎయిర్‌పోర్టులు రష్యా వశమవుతున్నాయి. తనకున్న ఆయుధసంపత్తితోనే ఉక్రెయిన్‌ ప్రతిఘటనకు దిగింది. రష్యాదాడిలో ఉక్రెయిన్‌ సైనికులతో పాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు. నాటోపై ఒత్తిడి పెరుగుతోంది. ఉక్రెయిన్‌ ఐక్యరాజ్యసమితి జోక్యం కోరుతోంది.

రష్యాపై యుద్ధం ఆలోచన లేదంటూనే అమెరికా సమర సన్నాహాల్లో ఉంది. బ్రిటన్‌నుంచి అమెరికా బాంబర్లు గాల్లోకి ఎగిరాయి. నాటో దళాలకు సహకరిస్తామని అగ్రరాజ్యం ప్రకటించింది. రష్యాపై ప్రతిదాడికి నాటోదళాలు సిద్ధమవుతుండటంతో యుద్ధం యూరప్‌కే పరిమితమయ్యేలా కనిపించడంలేదు. రష్యా దూకుడు ప్రపంచయుద్ధానికి దారితీసేలా ఉంది. ఉక్రెయిన్‌పై తమ దాడిని అడ్డుకునేందుకు ఎవరూ సాహసించొద్దని రష్యా హెచ్చరిస్తోంది. తనదాడిని పుతిన్‌ సమర్ధించుకుంటున్నారు.

రష్యా ఎయిర్‌స్ట్రిప్‌ టెక్నాలజీ వ్యవస్థని ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించుకుంది. ఉక్రెయిన్‌ పార్లమెంట్‌, బ్యాంకులు, ఐటీపై సైబర్‌ దాడులకు తెగబడింది. ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌ సర్వర్లపైనా రష్యా సైబర్‌ ఎటాక్‌ జరిగిందని సమాచారం అందుతోంది. ఎయిర్‌పోర్టులను స్వాధీనం చేసుకుంటున్న రష్యా ఉక్రెయిన్‌ పోర్టుసిటీపై కూడా బాంబుల వర్షం కురిపించింది. సైనికస్థావరాలు, కీలకవ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామంటోంది రష్యా. ఉక్రెయిన్‌ని స్వాధీనం చేసుకునే ఆలోచన లేదంటూనే దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

రష్యాకి బెలారస్‌ తోడవ్వటంతో ముప్పేటదాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌ నాటో దేశాలు కలిసొస్తాయనే నమ్మకంతో ఉంది. అందుకే రష్యా ఆయుధసంపత్తిని ఎదుర్కునే శక్తి లేకపోయినా గట్టిగానే ప్రతిఘటిస్తోంది. ఐదు రష్యా యుద్ధ విమానాలతో పాటు హెలికాప్టర్‌ని కూల్చినట్లు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. రష్యాదాడిలో 300మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. కైవ్‌లోని బ్రోవరీలో ఒకరు మరణించారని, ఒకరు గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకవైపు జనంలో ఆందోళన మొదలైంది. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల వద్ద జనం బారులు తీరుతున్నారు. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు సూపర్ మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు.

రష్యా తమ మాటను లెక్కచేయకపోవటంతో నాటో దేశాలు కూడా ఉక్రెయిన్‌పై దాడిని సీరియస్‌గా తీసుకున్నాయి. రేపు జీ సెవెన్‌ దేశాల అత్యవసర సమావేశానికి అమెరికా పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం వద్దని రష్యాకి ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తిచేసింది. మరోవైపు, ఉక్రెయిన్‌పై దాడిని పూర్తిగా సమర్ధించుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. ఇప్పటికైనా ఉక్రెయిన్‌ సైన్యం లొంగిపోతే మంచివదని సలహా ఇచ్చారు. నాటో బలగాలు ఉక్రెయిన్‌కు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.