Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌లో గత నెల రోజులుగా యుద్ధం కొనసాగుతోంది.ఇప్పటి వరకు ఈ యుద్ధంలో వేలాది మంది మరణించారు. లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వలసపోయారు. ఈ ఒక నెలలో, రష్యా ఉక్రెయిన్‌లోని దాదాపు అన్ని ప్రధాన నగరాలను నాశనం చేసింది. ఉక్రెయిన్‌పై నిరంతర దాడుల మధ్య, రష్యా(Russia)పై అన్ని ఆంక్షలు విధించాయి. కానీ ఇప్పటివరకు రెండు దేశాలు సాధించింది ఏమీ లేదు. గత 10 రోజలు కిందట మారియుపోల్(Mariupol)లో 1300 మందికి పైగా తలదాచుకున్న డ్రామా థియేటర్(Theatre) పై రష్యా బాంబు దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఆ భవనం పూర్తిగా నేలమట్టమైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కనీసం 300 మందికి పైగా దుర్మరణం పాలైనట్టు ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి.
మరోవైపు యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తినేందుకు తిండి దొరక్క స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శవాలను తీసుకెళ్లేవారు కూడా లేకపోవడంతో మారియుపోల్ తరహాలో సామూహిక ఖననాలు జరుగుతున్నాయి. కొందరు శిథిలాల మధ్య బూడిదలో తిరుగుతూ తమవారి కోసం, ఆహారం కోసం వెతుకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక గత నెల 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభమవ్వగా.. 28వ తేదీ నుంచి మారియుపోల్ నగరంపై వరుస దాడులు కొనసాగాయి. గత వారానికి మారుయుపోల్ నగరం 90 శాతానికి పైగా ధ్వంసమైంది.+
ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. ఉక్రెయిన్ లేదా రష్యా కూడా తల వంచడానికి సిద్ధంగా లేదు. ఈ యుద్ధం సైనికుల మానసిక స్థితిని కూడా ప్రభావితం చేసింది. యుద్ధ సమయంలో కలిగే నిరాశ సైనికుల ముందు పెను సవాలు. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 1,351 మంది రష్యన్ సైనికులు మరణించారని రష్యా మిలిటరీ జనరల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ తెలిపారు. 3,825 మంది రష్యా సైనికులు గాయపడ్డారు. అదే సమయంలో, NATO ఇచ్చిన సమాచారం ప్రకారం, 1 నెలగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు 15 వేల మంది రష్యన్ సైనికులు మరణించారు. రష్యా గణాంకాలు తూర్పు ఉక్రెయిన్‌లో పోరాడుతున్న రష్యా-మద్దతుగల వేర్పాటువాదులను చేర్చలేదు.
ఇదిలావుంటే, ఐదవ సైనిక అధికారి ఉక్రెయిన్‌లో మరణించాడు. దీనిని ధృవీకరిస్తూ, నల్ల సముద్రం నౌకాదళానికి చెందిన 810వ ప్రత్యేక గార్డ్స్ మెరైన్ బ్రిగేడ్‌కు చెందిన కల్నల్ అలెక్సీ షరోవ్ ఉక్రేనియన్ స్నిపర్ దాడిలో ప్రాణాలు కోల్పోయారని రష్యా అధికారులు తెలిపారు.