
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో తొలిసారి రష్యాపై పెద్ద ఎత్తున డ్రోన్లతో విరుచుకుపడింది ఉక్రెయిన్. రష్యాకు చెందిన నాలుగు వైమానిక స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 40కిపైగా రష్యా బాంబర్ ప్లేన్లు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ ప్రకటించుకుంది. రష్యా భూభాగంలోకి వందల కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఉక్రెయిన్ దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ దాడిలో రష్యాకు చెందిన టీయూ-95, టీయూ-22 ఎం-త్రీ బాంబర్లు, ఏ-50 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ వెల్లడించింది.
ఈ దాడులను రష్యాలోని ఇర్కుట్స్క్ గవర్నర్ కూడా ధ్రువీకరించారు. బెలయా, ఓలెన్యా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా పర్యవేక్షించారని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ దాడులకు ప్రణాళిక జరుగుతోందన్నారు. ఇక ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాకు దాదాపు 2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లి ఉంటుందని సమాచారం. మాస్కోకు ఇది గణనీయమైన ఎదురుదెబ్బ అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అంతకుముందు ఉక్రెయిన్‌పై రష్యా పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేసింది. ఏడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. సైనిక శిక్షణ కేంద్రంపై జరిగిన క్షిపణి దాడిలో 12 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారని అధికారులు తెలిపారు. 60 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారు. రష్యా దాదాపు 472 డ్రోన్లను ప్రయోగించిందని వివరించారు. అందులో 385 డ్రోన్లను తాము అడ్డుకున్నామని తెలిపారు. ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా అలర్ట్ అయ్యింది. కీవ్‌పై ప్రతిదాడులకు దిగేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.
స్పాట్..
ఇదిలా ఉండగా ఇవాళ ఇస్తాంబుల్‌లో ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చల్లో తమ ప్రతినిధి బృందం పాల్గొంటుందని, సంపూర్ణ కాల్పుల విరమణ, ఖైదీల విడుదల తమ ప్రధాన ప్రాధాన్యతలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అయితే ఈ డ్రోన్ దాడుల ప్రభావం చర్చలపై ఏ రకంగా ఉండబోతోందన్నది ఉత్కంఠగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..