ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి రష్యా ఎంతో మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైంది. మరియపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడి సాధారణ ప్రజానీకానికి కూడా తీవ్ర కష్టాన్ని తెచ్చిపెట్టింది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతటి మారణహోమం జరిగిందో తెలిపే మరో ఘటన ఉక్రెయిన్‌లో వెలుగుచూసింది. రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన మరియపోల్‌లో శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్ లో భరించలేని దుర్గంధం వెలువడింది. దాంతో లోపలికి వెళ్లి చూసిన అధికారులు అక్కడి దృశ్యాలను చూసి నిశ్చేష్టులయ్యారు. దాదాపు 200 వరకు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి.
మేరియుపొల్ నగరంలో దాదాపు 21,000 మంది చనిపోయారనీ, ఈ ఘోరాలు బయటపడకుండా చూడడానికి సంచార దహనవాటికలను తీసుకురావడంతో పాటు సామూహిక పూడ్చివేతలను రష్యా చేపడుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది.. రష్యా సైనికులు డాన్‌బాస్ ప్రాంతంలో ముమ్మర దాడులు కొనసాగించారు. సీవియెరోదొనెటస్కీ, చుట్టుపక్కల నగరాలను చుట్టుముట్టి, దిగ్బంధం చేయడానికి బలగాలను మోహరించారు. స్విట్లోడార్‌స్కీ పట్టణాన్ని రష్యా సేనలు స్వాధీనపరచుకున్నాయి.