AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russo-Ukrainian War: ఉక్రెయిన్‌పై పుతిన్ దూకుడు.. భారత్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న తటస్థ వైఖరి..

Russo-Ukrainian War: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా వెనక్కి తగ్గకపోగా.. దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను

Russo-Ukrainian War: ఉక్రెయిన్‌పై పుతిన్ దూకుడు.. భారత్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న తటస్థ వైఖరి..
Modi And Putin
Shiva Prajapati
|

Updated on: Feb 27, 2022 | 7:19 PM

Share

Russo-Ukrainian War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా వెనక్కి తగ్గకపోగా.. దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను దాదాపుగా తమ ఆధీనంలోకి తీసుకున్న రష్యన్ బలగాలు.. ఇప్పు మరో నగరంపైపు దూసుకెళ్తున్నారు. రష్యా మెరుపుదాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల సాయం కోరుతోంది ఉక్రెయిన్. ఆదేశ అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు ఫోన్ చేసి మరీ సాయం అర్ధిస్తున్నారు. అండగా నిలవాలని కోరుతున్నారు. ఇకపోతే.. రష్యా దాడుల నేపథ్యంలో భారత్ బాధ్యత మరింత పెరిగిందనే చెప్పాలి. రష్యాను నిలువరించగల శక్తి ఒక్క భారత్‌కే ఉందని ఉక్రెయిన్ భావిస్తోంది. అందుకే తమకు అండగా నిలవాలని, యుద్ధం ఆపేలా రష్యాకు సూచించాలని ఉక్రెయిన్ ప్రభుత్వం అర్ధిస్తోంది. ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబారి మాట్లాడుతూ.. రష్యా – ఉక్రెయిన్ మధ్య ఘర్షణ వాతావరణం సమసిపోవడానికి భారత్ సహకరించాలని కోరారు. రష్యాతో భారత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం నేపథ్యంలో.. చొరవ తీసుకుని దాడులను ఆపేలా కోరాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 20,000 మంది భారతీయులు, అందులోనూ విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఇప్పటికీ చిక్కుకుపోయారని, ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి భారత్‌కు ఉందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే.. ‘‘తక్షణమే యుద్ధాన్ని విరమించి, దౌత్యపరమైన చర్చలు జరపాలి’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా.. దేశ భద్రతా కారణాల రీత్యా ఈ చర్యలు తప్పడం లేదని, దీనిని ఇతర దేశాలు అర్థం చేసుకోవాలని కోరారు పుతిన్. అంతేకాదు.. రష్యా చర్యను భారత్ వ్యతిరేకించదనే భావిస్తున్నామంటూ ఆ దేశ ముఖ్య నేతలు ప్రకటించారు. అందులోనూ భారత్‌కు రష్యా ఎంతో సన్నిహిత దేశం కావడంతో.. ఈ దాడులను వ్యతిరేకించలేక, అలాగని సమర్థించలేక మౌనం వహిస్తూ వచ్చింది. ఈ యుద్ధంపై తాము తటస్థ వైఖరిని అవలంభిస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. చివరికి ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి కూడా దూరంగా ఉండిపోయింది.

అయితే, భారత వైఖరిని ఢిల్లీలోని రష్యా దౌత్యవేత్తలుు ప్రశంసించారు. ఇండియా స్వతంత్ర వైఖరిని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను వీలైనంత త్వరగా ముగించి, దౌత్యపరమైన చర్యలు జరుపకపోతే.. భారత్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదంటే పాశ్చాత్య దేశాల వ్యతిరేకతను భారత్ సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెన్సీని కలిగి ఉన్న ఫ్రాన్స్.. ఇప్పటికే భారత్‌పై తీవ్రమైన ఒత్తిడిని తీసుకువస్తోంది. యూఎన్ చార్టర్‌ను వ్యతిరేకించిన రష్యా పట్ల కఠినంగా ఉండాలని భారత్‌ను కోరింది. యూరప్‌లో పుతిన్ సృష్టించిన అస్థిరత.. భారత్‌కు ఏమాత్రం ప్రయోజనం కాదని, రష్యా చర్యను సమర్థించద్దని ఫ్రెంచ్ వర్గాలు కోరాయి.

తటస్థ వైఖరి ప్రమాదమే..

రష్యా – ఉక్రెయిన్ వ్యవహారంలో భారత్ తటస్థ వైఖరి అవలంభిస్తోంది. శాంతిని ఉపదేశించి.. యుద్ధం వీడి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే, భారత్ తటస్థ వైఖరి పట్ల పాశ్చాత్య దేశాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాల నేపథ్యంలో యుద్ధం జరుగకుండా ఆపగలదని భావిస్తే.. తటస్థంగా ఉండిపోవడంతో గుర్రుగా ఉన్నాయి పాశ్చాత్య దేశాలు. ఉక్రెయిన్ సమస్యపై భారతదేశం సందిగ్ధత ఇలాగే కొనసాగితే, అది అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలతో అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక సంబంధాలను ప్రమాదంలో పడేస్తుంది. సరిహద్దుల్లో చైనా ఆగడాలను ఎదుర్కొవడం భారత్‌కు కష్టతరం. అమెరికా, ఫ్రాన్స్‌తో పాటు పాశ్చాత్య దేశాల మద్ధతు ఇండియాకు అవసరం. కానీ, ఇలా తటస్థంగా ఉంటే.. ఒకవేళ చైనా భారత్‌పై దాడి చేసినట్లైతే ప్రపంచ దేశాల మద్ధతు కూడగట్టడం కష్టమవుతుంది. ఆసియాలో బలమైన దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్ రెండూ పుతిన్ చర్యను తీవ్రంగా వ్యతిరేకించి.. అమెరికా పంచన చేరాయి. భారత్ మాత్రం ఇప్పటికీ మౌనంగా ఉంటూ ఒంటరిగా మిగిలిపోయింది.

1962 దక్షిణ టిబెట్‌ను విముక్తి కల్పించే నెపంతో చైనా ఇండియాపై మెరుపుదాడికి పాల్పడింది. అలాంటి దాడినే అరుణాచల్ ప్రదేశ్‌పై చేస్తే ఇండియా పరిస్థితి వేరుగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై పుతిన్ చర్యలను భారత్ ఖండించకపోతే.. చైనా విషయంలో ప్రపంచ మద్ధతు పొందడం కష్టతరం అవుతుంది. ఇప్పటికే హిమాలయాల్లో చైనా అలజడి మరింత పెరిగింది. విస్తృతమైన సైనిక విన్యాసాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకే.. యుద్ధాన్ని వెంటనే ఆపేసి.. చర్చలకు వచ్చేలా రష్యాను ఒప్పించడమే భారత్‌ ముందున్న మార్గం. సమర్థవంతమైన మధ్యవర్తిత్వం ద్వారా ఉక్రెయిన్‌పై అనివార్యమైన టగ్ ఆఫ్ వార్ ఒత్తిళ్లను భారత్ కాపడగలుగుతుంది. అంతేకాదు.. ఈ చర్యలు భారత ఆర్థిక వ్యవస్థను సైతం ప్రేరేపిస్తాయి.

అమెరికా వార్నింగ్..

ప్రస్తుత సంక్షోభ సమయంలో రష్యాకు మద్ధతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేశాలన్నింటికీ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తీవ్రంగా హెచ్చరించారు. తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ సీరియస్ వారింగ్ ఇచ్చారు. ఇక రష్యాకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు భారీ ఎత్తున ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో రష్యా మిలిటరీ హార్డ్‌వేర్‌ను భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. అయితే, భారత్, రష్యాకు మిలటరీ హార్డ్‌వేర్‌ను ఎగుమతులు చేస్తే యూఎస్ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

భారత్‌కు కలిసొచ్చే అంశం..

నాటోలో చేరాలనే ఉక్రెయిన్ సంకల్పం.. పుతిన్‌ను కలవర పెట్టింది. ఆ భయం కారణంగానే పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు. సైనిక దాడిని ప్రారంభించడానికి ముందు ఉక్రెయిన్ ప్రత్యేక జాతీయత వాదనను పుతిన్ తిరస్కరించారు. రష్యా భద్రతను దాడికి కారణంగా చూపారు. ఈ కారణం భారత్‌కు కొంత ఊరటగానే చెప్పవచ్చు. ఎవరి భద్రతా కారణాలు వారికి ఉంటాయి. భద్రతా పరమైన సమస్యల పరిష్కారంలో కల్పించుకోవడం అనేది అతి అవుతుందని భారత్ వాదించే అవకాశం ఉంది. అయితే, పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేయడం ద్వారా ప్రమాదంలో పడ్డారు. రష్యా తీరు యావత్ ప్రపంచాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఫలితంగా.. రష్యాను చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ యుద్ధ ప్రభావం భారత్‌పైనా ఉన్నప్పటికీ.. రష్యాను వ్యతిరేకించడం అనేది కష్టమైన పనే అని చెప్పాలి. ఎందుకంటే రష్యాతో భారత్‌కు కొన్ని దశబ్ధాలుగా మంచి స్నేహ బంధం ఉంది.

Also read:

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రశాంతంగా ఉంటారు.. అందులో మీరున్నారా..

Amritha aiyer: చీరకట్టులో తెలుగుతనం ఉట్టిపడేలా అమృత అయ్యర్… ఆకట్టుకుంటున్న ఫొటోస్…

IND vs SL: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. రోహిత్‌తో ఓపెనర్‌గా వచ్చేది ఎవరంటే?