అమెరికా, కెనడాలలో మండిపోతున్న ఎండలు, పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో విలవిలలాడుతోన్న జనాలు

| Edited By: Phani CH

Jul 01, 2021 | 9:37 AM

అమెరికా, కెనడా దేశాలలో జనం బయటకు రావడానికే భయపడిపోతున్నారు.. వస్తే పోతామేమోనన్న భయం.. అందుకు కారణం కరోనా వైరస్‌ కాదు.. మండుతోన్న ఎండలు..

అమెరికా, కెనడాలలో మండిపోతున్న ఎండలు, పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో విలవిలలాడుతోన్న జనాలు
Canada Us Temperatures
Follow us on

అమెరికా, కెనడా దేశాలలో జనం బయటకు రావడానికే భయపడిపోతున్నారు.. వస్తే పోతామేమోనన్న భయం.. అందుకు కారణం కరోనా వైరస్‌ కాదు.. మండుతోన్న ఎండలు.. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదన్న హెచ్చరికలు జారీ అయ్యాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది. అమెరికా, కెనడా దేశాలలో ఇది ఎర్లీ సమ్మర్‌.. అంటే వేసవి కాలానికి ఆగమనం చెప్పే సీజన్‌.. ఇప్పుడే అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నారు.. ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లోనే ఉంటూ ఏసీలు వేసుకుంటూ గడిపేస్తున్నారు.. ఇప్పటికే కెనడాలో 240 మందికిపైగా వడగాలులకు మరణించారు. అమెరికాలోనూ ఎండవేడికి తాళలేక పదుల సంఖ్యలో మరణించారు.

పశ్చిమ అమెరికాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది.. అసలు తాము ఉన్నది అమెరికాలోనేనా అన్న అనుమానం అక్కడివారికి కలుగుతోంది. భానుడి
భగభగలను తట్టుకోలేక ప్రజలు విలవిలలాడిపోతున్నారు. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌, ఒరేగాన్‌, సలేమ్‌, సియాటిల్‌ నగరాలలో అయితే ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరుగుతున్నాయి. మామూలు ఎండలకే తట్టుకోలేని అక్కడి వారు 46 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలను ఎలా తట్టుకుంటారు? కెనడాలోని వాంకోవర్‌లో అయితే ఇప్పటికే 135 మంది చనిపోయారు. అక్కడి బ్రిటిష్‌ కొలంబియాలోని లైటన్‌లో 49.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అసలు కెనడాలో ఇంత ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదలు.. వడగాలులు వీస్తుండటంతో జనం గడపదాటడం లేదు. ఆల్‌రెడీ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లను మూసివేశారు. స్కూల్స్‌ ఎప్పుడో మూతబడ్డాయి.. రోడ్డు మీద తిరిగే జనం కోసం తాత్కాలికంగా వాటర్‌ ఫౌంటేన్లను ఏర్పాటు చేశారు. అనేక చోట్ల కూలింగ్‌ సెంటర్లు తెరచుకున్నాయి.

వాషింగ్టన్‌లో పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అక్కడా ఎండలు మండుతూనే ఉన్నాయి. అందరూ ఏసీలు వేసుకోవడంతో విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగింది.. దాంతో చాలా చోట్ల కరెంట్ సరఫరా ఆగిపోతున్నది.. అసలే మండే ఎండలు.. దానికి తోడు పవర్‌కట్‌.. ఇక జనం అవస్థలు అన్నీ ఇన్నీ కావు.. ప్రత్యక్ష నారాయణుడి ధాటికి ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. అమెరికాలో 11 రాష్ట్రాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వేసవి కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు అందరిలో నెలకొన్నాయి. ఈ సమ్మర్‌ మామూలుగా ఉండదని నిర్ణయానికి అందరూ వచ్చేశారు. పెరుగుతోన్న టెంపరేచర్లను దృష్టిలో పెట్టుకుని వాషింగ్టన్‌లో కరోనా నియంత్రణను సడలించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కూలింగ్‌ సెంటర్లలో ప్రజలను అనుమతిస్తున్నారు. అలాగే ఎయిర్‌ కండిషనింగ్‌ ఉండే… థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌లో కూడా నిబంధనలను సడలించారు.. వాటిల్లో ప్రజలను పూర్తిగా అనుమతిస్తున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌లలో కూడా ఇప్పుడు నిబంధనలు లేవు. ఎండలను తట్టుకోలేని వారంతా స్విమ్మంగ్‌ పూల్‌లలో సేద తీరుతున్నారు.

ఫసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల్లో తేడా కారణంగా ఏర్పడే హీట్‌డోమ్‌తోనే ఎండలు మండిపోతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. పైగా పర్యావరణానికి మనం చేస్తున్న కీడు అంతా ఇంతా కాదు.. ప్రకృతికి మనం చెడు తలపెడుతున్నాం కాబట్టే ఆ ప్రకృతి కూడా మనపై ప్రతాపం చూపుతోందని అంటున్నారు. మండే ఎండలకు, గ్లోబల్‌ వార్మింగ్‌కు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అంటున్నారు కానీ.. సంబంధం లేకుండా ఎలా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం మంచిది కాదని చెబుతున్నారు. ఏసీ గదుల్లోనే ఉండాలని, వీలైనంత ఎక్కువగా నీళ్లుతాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: LPG Cylinder Price : గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్..! భారీగా పెరిగిన ఎల్పీజి సిలిండర్ ధరలు.. ప్రస్తుత ధరలు ఇలా..?

Corrupt Officers: లంచం ఇవ్వనిదే పని జరగదు.. ఏసీబీకి చిక్కిన అటవీ అధికారి.. ఎంత లంచం డిమాండ్ చేశాడంటే..