UK PM Boris Johnson: పార్టీగేట్ కుంభకోణం బ్రిటన్ ప్రధాని పదవికి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. సొంత పార్టీ ఎంపీలే ఆయనపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. పార్టీగేట్ కుంభకోణం విషయంలో ఇప్పటికే ఇంటా బయట తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు ఇప్పుడు పదవీ గండం పొంచి ఉంది. కరోనా సమయంలో బోరిస్ తన ఇంటిలో ఇచ్చిన విందు ఆయనకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. సొంత పార్టీ సభ్యులే ఆయన చర్యను తప్పుపడుతున్నారు. ఏకంగా ఇప్పుడు అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. బోరిస్ జాన్సన్ ప్రధానిగా కొనసాగడం తమకు ఇష్టం లేదంటూ ఇప్పటికే లేఖలు రాశారు. దాదాపు 40 మంది సభ్యులు ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు.
బ్రిటన్ పార్లమెంటులోని దిగువ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 650 ఉండగా బోరిస్‌కు చెందిన అధికార కన్సర్వేటివ్ పార్టీకి 359 మంది బలం ఉంది. ఆయన్ని ప్రధాని పదవి నుంచి తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో తెలియదు.. బోరిస్ జాన్సన్ మీద అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఉన్నా, సొంత పార్టీలో రాజకీయంగా ఆయనకు చాలా ఇబ్బందులనే తెచ్చి పెట్టనుంది అయితే ఆయన అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కితే మరో ఏడాది వరకూ ప్రధాని పదవికి ఎలాంటి డోకా ఉండదు.. పార్టీ గేట్ స్కామ్‌పై ప్రధాని బోరిస్ జాన్సన్ ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా జాతికి క్షమాపణ చెప్పారు.. తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు.. కానీ అధికార కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు మాత్రం ఆయనను తప్పించే విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు.