Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ ఉక్కిరిబిక్కిరి.. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఇలా..?

రివెంజ్‌ పక్కా... తేలుస్తాం పాక్‌ లెక్క అని చెప్పిమరి దెబ్బ కొట్టింది భారత్. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో మెరుపుదాడులు చేసి పెద్దఎత్తున ఉగ్రవాదులను సమాధి చేసేసింది. మాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. మరి ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత పాక్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయ్...? భారత్‌ రివెంజ్‌పై పాక్‌ ప్రజలు ఏమంటున్నారు...?

Operation Sindoor:  ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ ఉక్కిరిబిక్కిరి.. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఇలా..?
Pakistan

Updated on: May 07, 2025 | 8:46 PM

భారత్ అన్నంత పని చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ… ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపుదాడులతో విరుచుకుపడింది. మొత్తం 9 ఉగ్రస్థావరాలు లక్ష్యంగా మిసైళ్ల వర్షం కురిపించింది… 100 మందికిపైగా ఉగ్రవాదులను సమాధి చేసి పాక్‌ను షాక్‌కు గురిచేసింది. దీంతో పాకిస్తానీలు వణికిపోతున్నారు. యుద్ధభయంతో ఎప్పుడు ఏం జరుగుతుందో… భారత్ ఎక్కడ దాడి చేస్తుందోనన్న ఆందోళనతో బిక్కచచ్చిపోతున్నారు.

ఇంట్లోంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు పాకిస్తానీలు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని డబ్బుల కోసం ఏటీయంల ముందు బారులు తీరుతున్నారు. భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సైతం ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఇక భారత్ మెరుపుదాడులతో లాహోర్‌, సియాల్‌కోట్ ఎయిర్‌పోర్టులు మూసి వేసింది పాక్‌ ప్రభుత్వం. ఇస్లామాబాద్‌, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అలాగే వైద్య సిబ్బందికి సెలవులు రద్దుచేశారు. అటు పాక్ పంజాబ్‌లో విద్యాసంస్థలు మూసివేశారు.

మరోవైపు ఇప్పటికే ఆర్థికమాంద్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది పాకిస్తాన్. పప్పు, ఉప్పులకు కూడా అక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు. పెరిగిన రేట్లు, పడిపోయిన దిగుమతులతో అల్లాడిపోతున్నారు. అలాంటి టైమ్‌లో పహల్గామ్ ఎటాక్ జరగడం… ఆ తర్వాత భారత్ విధించిన ఆంక్షలతో నీటి నుంచి మెడిసిన్‌ వరకూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆపరేషన్‌ సిందూర్‌తో అక్కడి స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలిపోయాయి. ఈ స్ట్రైక్స్‌ ఇక్కడితోనే ఆగుతాయా…? యుద్ధం దిశగా వెళ్తాయా…? అన్న భయాలతో పాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. అత్యంత దారుణంగా 6 శాతానికి పడిపోయాయి.

పహల్గామ్‌ దాడితో పాక్‌లో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ దేశం… ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇండియా పట్ల పాకిస్తాన్ ప్రధాని వ్యవహరిస్తున్న తీరుపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత బలమైన ఇండియాను… తట్టుకోవడం కష్టమేనని పాక్‌ ప్రజలు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ఇండియా సమర సన్నాహాల నేపథ్యంలో.. పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం మత పెద్దలు… ఇస్లామాబాద్‌లోని కొంతమంది ప్రజలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు ప్రజలందరూ ఇండియాతో యుద్ధానికి తాము మద్దతు ఇవ్వలేమని స్పష్టం చేసినట్టు సమాచారం అందుతుంది. అంతేకాదు, పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై ముస్లిం మతపెద్దలు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి.

మొత్తంగా… ఆపరేషన్‌ సింధూర్‌తో పాక్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది…! భారత్‌ ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందోనన్న భయంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వీలైతే ఎక్కడికైనా వెళ్లిపోదాం… లేదంటే ఇంట్లోనే ఉండిపోదాం అన్న పరిస్థితికొచ్చారు. మరి రేపు, ఎల్లుండి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి…!