
ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం ప్రధాని బ్రెజిల్ వెళ్లారు. బ్రెజిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, స్పేస్, టెక్నాలజీ, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో రెండుదేశాల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయి. 17వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు ప్రధాని మోదీ. అంతకు ముందు ప్రధాని మోదీకి లభించిన ఘన స్వాగతం హైలెట్‌గా నిలిచింది. ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు సంప్రదాయ స్వాగతం పలికారు. ఆపరేషన్ సింధూర్ థీమ్‌తో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. పాక్ ఉగ్రవాదంపై భారత దాడిని కీర్తిస్తూ కళాకారులు నృత్యం చేశారు. భారత్ మాతా కీ జై నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది. బ్రెజిల్ స్థానిక తెగల ప్రజలు అడవుల్లో వినిపించే స్వదేశీ సంగీతంతో కలిపిన శివ తాండవ స్తోత్రం ప్రదర్శించారు. ఈ ప్రత్యేక స్వాగతం భారత సంస్కృతిని, ఆధ్యాత్మికతను గౌరవిస్తూ, బ్రెజిల్ స్థానిక సంస్కృతితో మేళవించి ఇవ్వడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు
Highlights from the programmes in Brasilia.
May India-Brazil friendship keep getting stronger and stronger! pic.twitter.com/NL1WAwAhW8
— Narendra Modi (@narendramodi) July 9, 2025
ఇక భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్’ లభించింది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ కృషి, కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకు గానూ బ్రెజిల్ అధ్యక్షుడు లులా.. ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలను మోదీ అందుకోవడం ఇది 26వ సారి. ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా 140 కోట్లమంది భారతీయులకూ గర్వకారణమన్నారు ప్రధాని మోదీ.
అంతకు ముందు బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని బ్రిక్స్ సదస్సులో ప్రస్తావించారు ప్రధాని నరేంద్రమోదీ. ఇది ప్రపంచ మానవాళిపై జరిగిన దాడి అన్నారు మోదీ. ఉగ్రవాదం యావత్ ప్రపంచానికి తీవ్ర సవాలుగా మారిందన్నారు. ఉగ్రవాద బాధితులను, మద్దతుదారులను ఒకే త్రాసులో తూకం వేయలేమన్నారు ప్రధాని. ఉగ్రవాదులపై ఆంక్షల విషయంలో ఎలాంటి సంకోచం ఉండకూడదని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ నిర్ణయం తీసుకోవడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్ర పోషించాలన్నారు భారత ప్రధాని. శాంతి, భద్రత, ప్రపంచ పాలనా సంస్కరణలపై బ్రిక్స్ సమావేశంలో మోదీ మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న దేశాలకు నిర్ణయం తీసుకునే జాబితాలో స్థానం దక్కడం లేదన్నారు ప్రధాని. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత ఇలా ప్రతి విషయంలోనూ గ్లోబల్ సౌత్ దేశాలు బాధితులవుతున్నాయన్నారు.
బ్రెజిల్‌లోని రియో డీ జనీరో వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో భారత్ సహా బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నేతలు హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత అభివృద్ధి తదితర అంశాలపై ప్రపంచ సంస్థల నుంచి గ్లోబల్ సౌత్ దేశాలకు కనీస సహకారం ఉండటం లేదన్నారు ప్రధాని. గ్లోబల్ సౌత్ దేశాలు లేకుండా ఈ సంస్థలన్నీ సిమ్‌కార్డుండి.. నెట్‌వర్క్‌లేని మొబైల్‌ఫోన్ల లాంటివని వ్యాఖ్యానించారు. 20వ శతాబ్దం నాటి టైప్‌రైటర్లతో 21వ శతాబ్దం నాటి సాఫ్ట్‌వేర్ నడవదన్నారు ప్రధాని.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి