
మంచు తుపాను ధాటికి అమెరికా అతలాకుతలమవుతోంది. భారీగా కురుస్తున్న హిమపాతానికి పలు నగరాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. న్యూయార్క్ రాష్ట్రం బఫెలో నగరంలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. అతి తీవ్ర హిమపాతం, అతి శీతల గాలుల కారణంగా 27 మంది చనిపోయినట్లు అధికార గణాంకాలు వెల్లడించాయి. ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయిలోనే నమోదవుతుండటంతో అమెరికాలో జనజీవనం స్తంభించింది. విద్యుత్ కోతలతో అంధకారం నెలకొంది. హీటర్లు పనిచేయక పరిస్థితి మరీ దారుణంగా మారింది. విమాన సర్వీసులు రద్దవడంతో ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బాంబ్ సైక్లోన్ కారణంగా మరింత ప్రమాదకర సిట్యువేషన్ ఏర్పడిందని అధికారులు వివరించారు. న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరంలో హరికేన్ స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయి. అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ గ్రంథాలయాలు, పోలీసు స్టేషన్లను తాత్కాలిక శిబిరాలుగా ఉపయోగిస్తున్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో న్యూయార్క్ నగరాన్ని మంచు ముంచెత్తుతోంది. కొద్ది రోజులుగా మంచుతుఫాను బీభత్సం సృష్టిస్తోంది. అమెరికాలోని 5.5 కోట్ల మందిపై ఈ మంచుతుఫాను ప్రభావం పడింది. న్యూయార్క్, బఫెలో నగరంలో హరికేన్‌ని తలపించే చలిగాలులు వీస్తున్నాయి. దట్టంగా పరుచుకున్న మంచు కారణంగా అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు. వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. విద్యుత్ కోతలు పెరిగాయి. నిర్ణీత సమయంలో విద్యుత్ కోతలు మరికొంత కాలం తప్పదని ప్రభుత్వం వెల్లడించింది. విద్యుత్ సరఫరా దెబ్బతిన్న చోట్ల మరమ్మత్తులు చేసి, విద్యుత్ పునరుద్ధరిస్తున్నారు. బఫెలో లోని ఇంర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని మూసివేశారు.
మంచు తుఫానుతో వాతావరణ పీడనం కనిష్టస్థాయికి పడిపోతే దాన్ని “బాంబ్ సైక్లోన్” అంటారు. ఇప్పుడు ఇదే బాంబ్ సైక్లోన్ అమెరికాని గజగజ వణికిస్తోంది. ఆర్కిటిక్ నుంచి వచ్చే అతిశీతల గాలుల వల్ల అమెరికా, కెనడా గడ్డకట్టిపోతోంది. ప్రధానంగా ఉత్తర అమరికాలో సాధారణంగా సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. అందువల్ల వేడికంటే, చలి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు తాజా చలిగాలులు వణికిస్తున్నాయి. వెర్మోంట్, ఒహియో, మిస్సోరీ, విస్కాన్సిన్, కన్సాస్, కొలరాడోల్లో ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం