Pakisthan: దేశంలో అవినీతిని అంతం చేస్తానని హామీ ఇచ్చి ఇమ్రాన్ ఖాన్(Imran Khan )పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ అలా చేయడంలో విఫలమవడంతో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వివాదం తెరపైకి వచ్చింది. ఓ వైపు పాక్ ప్రజలు తినడానికి తిండిలేని స్టేజ్ చేరుకుంటూ.. పేదవారు మరింత పేదవారిగా మారుతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇమ్రాన్‌కి చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ కేబినెట్‌లోని 12 మంది సభ్యుల ఆస్తులు పెరిగినట్లు అధికారిక పత్రాల ద్వారా వెల్లడవుతుంది. ఇమ్రాన్ పార్టీకి చెందిన ఈ నేతలు ఎంపీగా, మంత్రిగా ప్రభుత్వంలో చేరి మూడున్నరేళ్ల కాలంలో ఎన్నో రకాలుగా అవినీతి చేశారని.. ఆస్తులను దోపిడీలు చేశారని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం పాక్ లో గత ప్రభుత్వం చేసిన అవినీతి పై విచారణ చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఆయన క్యాబినెట్ లో పనిచేసిన మాజీ మంత్రులు షా మెహమూద్ ఖురేషీ, షేక్ రషీద్ అహ్మద్, ఉమర్ అయూబ్ ఖాన్, అజం ఖాన్ స్వాతి, ఖుస్రో భక్తియార్, ఫైసల్, షఫ్కత్ మహమూద్, ఫహ్మిదా మీర్జా, జుబేదా జలాల్, మెహబూబ్ ఛీల్తాన్ , తహబూబ్ సుల్తాన్ ఆస్తులు.. గత రెండేళ్ల కాలంలో భారీగా పెరిగాయని గుర్తించారు. ఇప్పుడు వీరి ఆస్తులపై దృష్టి సారించిన ప్రభుత్వం.. కొందరు మాజీ మంత్రులకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఇంత భారీగా ఆస్తులు ఎలా పెరిగిపోయాయని ప్రశ్నించింది. తగిన సమాధానాన్ని ప్రభుత్వానికి చెప్పాలంటూ కోరింది.
అయితే తమ ఆస్తుల పెరుగుదలపై వినిపిస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రులు స్పందిస్తూ.. ఆస్తి సమాచారం ప్రారంభంలో సరిగ్గా నమోదు కాకపోవడం వల్లే ఇలా జరిగిందని, కాలక్రమేణా పెరుగుతున్న ఆస్తుల విలువను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు.
పలువురు మంత్రులకు నోటీసులు:
నెలల తరబడి మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నేతల ఆస్తులకు సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ మేరకు పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ)కి, ఆ దేశ పన్నుల అధికారులకు మాజీ మంత్రులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రుల ఆస్తులు భారీగా పెరిగినట్లు గుర్తించారు. చాలా మంది రాజకీయ నాయకుల ఆస్తులు మూడు రెట్లు పెరిగాయి. అధికారిక సమాచారం ప్రకారం 2019 – 2020 సమయంలో బాధ్యతలు నిర్వహించిన ఆరుగురు మంత్రులకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. పెరిగిన ఆస్తుల వివరాలను తెలియజేయాలని కోరింది. మాజీ విదేశాంగ మంత్రి ఖురేషీ ఒక దశాబ్దం పాటు పార్లమెంటులో ఉన్నారు. రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఇక 2014 నుండి 2019 వరకు, అతని సంపద 241 శాతం పెరిగింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..