
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌ను మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆఫ్ఘనిస్తాన్‌తో సరిహద్దు వివాదం, భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరగడంతో దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. స్థానిక నివేదికల ప్రకారం.. లాహోర్, కరాచీతో సహా అనేక ప్రధాన నగరాల్లో టమాటా ధరలు రికార్డు స్థాయిలో పెరిగి కిలోకు రూ. 700కు చేరుకున్నాయి. కొన్ని వారాల క్రితం రూ. 100కి అమ్ముడైన టమాటాల ధర ఇంతగా పెరగడంతో సామాన్య పాకిస్తానీల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడింది.
టమాటా ధరల పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల టమాటా పంటలు పూర్తిగా నాశనం కావడంతో దేశీయ సరఫరా తీవ్రంగా తగ్గింది. సరిహద్దు వివాదం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం టమాటాలతో సహా అనేక కూరగాయల ఎగుమతిని నిలిపివేసింది.దీంతో పాక్‌కు టమాటాల రాక తగ్గింది. సరఫరాలో కొరత డిమాండ్ పెరగడం వల్ల ఈ ధరల పెరుగుదలకు కారణాలుగా చెప్పొచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌తో వాణిజ్య మార్గాలు మూసివేయడం వల్ల ధరలు విపరీతంగా పెరిగాయని క్వెట్టా, పెషావర్ వ్యాపారులు పేర్కొన్నారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఇరాన్ నుండి టమాటాలను అత్యవసరంగా ఆర్డర్ చేసినట్లు సమా టీవీ నివేదించింది. అయితే ఇవి ప్రజలకు చేరే వరకు ఉపశమనం లభించదని వ్యాపారులు, పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరానియన్ టమాటాలు పాకిస్తాన్ చేరేటప్పటికీ ఎంత తాజాగా ఉంటాయనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ పౌరులు, వ్యాపారులు వెంటనే ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని షరీఫ్ ప్రభుత్వాన్ని కోరారు. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం ద్వారా మాత్రమే కూరగాయల కొరతను అధిగమించవచ్చని వారు సూచించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..