Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌కు ఎదురుదెబ్బ, ప్రధానమంత్రి పదవికి అంతిమ ఘడియలు
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాన్ని ఎలా చేస్తావంటూ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరిని ఆ దేశ సుప్రీం కోర్టు స్ట్రయిట్‌గా ప్రశ్నించింది. ఖాసిం నిర్ణయాన్ని కొట్టివేస్తూ జాతీయ అసెంబ్లీని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.
గెలుపుకోసం ఆఖరి బంతికి అవసరమైన ఆరు పరుగులను సాధించానని అనుకున్నారు ఇమ్రాన్‌ఖాన్( Imran Khan). థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం ఎదురుచూడకుండానే సంబరాలు జరుపుకున్నారు. ప్రత్యర్థుల ఆట కట్టించానని ఆనందపడ్డారు. తీరా అది సిక్సర్ కాదు, బౌండరీనేనని అంపైర్ పాత్ర పోషించిన సుప్రీంకోర్టు చెప్పడంతో ఇప్పుడు డీలా పడిపోయారు. అలా చెప్పి ఊరుకోలేదు సుప్రీంకోర్టు. జాతీయ అసెంబ్లీ( Pakistan National Assembly) డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి(Qasim Suri) తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని కూడా తప్పు పట్టింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాన్ని ఎలా చేస్తావంటూ సూరిని స్ట్రయిట్‌గా ప్రశ్నించింది. ఖాసిం నిర్ణయాన్ని కొట్టివేస్తూ జాతీయ అసెంబ్లీని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవిశ్వాసాన్ని ఎదుర్కోక తప్పనిపరిస్థితి ఎదురయ్యింది ఇమ్రాన్‌ఖాన్‌కు! ఇలా జరుగుతుందని ఊహించని ఇమ్రాన్‌కు ఇది నిజంగానే పెద్ద షాక్! శనివారం, అంటే 9వ తేదీ ఉదయం పది గంటలకు జాతీయ అసెంబ్లీని సమావేశపరచి, ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలంటూ స్పీకర్‌ను సుప్రీం ఆదేశించడంతో పాకిస్తాన్ రాజకీయం మళ్లీ రసకందాయంలో పడింది.
విపక్షాలు ఇమ్రాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్‌కు చెందిన డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి రద్దు చేయడంతో ప్రతిపక్షాలు సుప్రీం కోర్టు తలుపు తట్టాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు విపక్షాలు పన్నాగాలు పన్నుతున్నాయని, ఇందుకు విదేశాలు అండదండలు అందిస్తున్నాయని ఖాసిం అప్పుడు చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న విదేశీ కుట్రగా అవిశ్వాస తీర్మానాన్ని అభివర్ణించారు. పైగా తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని చెప్పుకున్నారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయంతో జాతీయ అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వికి సూచించారు ఇమ్రాన్. ఇమ్రాన్ అభ్యర్థన మేరకు అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. మూడు నెలలలో ఎన్నికలను నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. దీంతో గండం గట్టెక్కినట్టేనని ఇమ్రాన్ భావించారు. మెజారిటీ లేని విషయం ఇమ్రాన్‌కు కూడా తెలుసు. తన ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న సంగతి కూడా తెలుసు. అయినప్పటికీ చివరి బంతి వరకు ఆడతానని, ప్రతిపక్షాలకు షాక్ ఇస్తానని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. ఓ నాలుగు రోజుల పాటు ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఇమ్రాన్ కథ మళ్లీ మొదటికి వచ్చింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం డిప్యూటీ స్పీకర్ ఖాసిం నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. పార్లమెంటు రద్దు నిర్ణయం కూడా రాజ్యాంగ విరుద్ధమేనని తెలిపింది. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 10.00 గంటలకు జాతీయ అసెంబ్లీని సమావేశపరచి, ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఓటింగు నిర్వహించాలంటూ స్పీకర్‌ను ఆదేశించింది. అంటే ఇమ్రాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి పదవి కూడా ఇంకొన్ని గంటల్లో ఊడిపోతుందన్న మాట! ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు లోపలా వెలుపలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పాకిస్తాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. ఆచీతూచీ స్పందిస్తోంది. ప్రస్తుత పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. ఇది వారి అంతర్గత వ్యవహారమని, తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్బీ అన్నారు.