Imran Khan: కోర్టుకు ఇమ్రాన్ ఖాన్‌.. ఇంతలో ఇంట్లోకి చొరబడ్డ పోలీసులు.. కార్యకర్తలపై లాఠీఛార్జ్!

|

Mar 18, 2023 | 5:01 PM

Imran Khan: తోషాఖానా కేసులో ఇస్లామాబాద్‌ కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా పోలీసులు తన ఇంటికి ఆక్రమించారని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు.

Imran Khan: కోర్టుకు ఇమ్రాన్ ఖాన్‌.. ఇంతలో ఇంట్లోకి చొరబడ్డ పోలీసులు.. కార్యకర్తలపై లాఠీఛార్జ్!
Imran Khan
Follow us on

పాకిస్థాన్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లాహోర్‌లోని పాకిస్తాన్‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ నివాసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ నివాసం నుంచి పెట్రోబాంబులను స్వాధీనం చేసుకున్నారు. 20 మంది ఇమ్రాన్‌ అనుచరులను అరెస్ట్‌ చేశారు. బుల్‌డోజర్ల సాయంతో మేన్‌ గేట్‌ను ధ్వంసం చేసి ఇమ్రాన్‌ ఖాన్‌ నివాసంలోకి దూసుకెళ్లారు పోలీసులు. అయితే ఇమ్రాన్‌ మద్దతుదారులు అడ్డుకోవడంతో అక్కడ భారీ ఘర్షణలు చెలరేగాయి. ఇమ్రాన్‌ మద్దతుదారులు కాల్పులు జరిపారని , కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. పెట్రోబాంబులు కూడా విసిరినట్టు ఆరోపించారు.

తోషాఖానా కేసులో ఇస్లామాబాద్‌ కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా పోలీసులు తన ఇంటికి ఆక్రమించారని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. తన భార్య బుష్రా బేగం ఒక్కరే ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు దాడి చేశారని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. పంజాబ్ పోలీసులు తన ఇంటిపై దాడి చేశారని.. తన భార్య ఒంటరిగా ఉన్న సమయంలో లోపలకు చొచ్చుకెళ్లారని మండిపడ్డారు ఇమ్రాన్. ఇదంతా కచ్చితంగా లండన్‌ ప్లాన్‌లో భాగమేన్న ఆయన.. నవాజ్ షరీఫ్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాకిస్థాన్‌లో మరోసారి అధికారంలోకి నవాజ్ షరీఫ్‌ను తీసుకొచ్చేందుకు కుట్ర జరుగుతోందని ట్విట్ వేదికగా ఘాటుగా విమర్శించారు ఇమ్రాన్. పోలీసులు PTI కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన వీడియోను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.


చాలా రోజులుగా ఇమ్రాన్ మద్దతు దారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. అందుకే ఇమ్రాన్ కోర్టుకు వెళ్లలేదు. ఈనేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లో శుక్రవారం రాత్రి 144సెక్షన్‌ విధించారు పోలీసులు. ఎవరూ గుమిగూడకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆయుధాలు పట్టుకుని తిరగొద్దని హెచ్చరించింది. డ్రైవింగ్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లు తప్పనిసరిగా దగ్గరుంచుకోవాలని తేల్చి చెప్పింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే తన అరెస్ట్‌ను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.


ఇదిలావుంటే, గల్ఫ్ దేశాలు గిఫ్ట్ ఇచ్చిన కాస్ట్‌లీ వాచ్‌లను అమ్మేసి పెద్ద మొత్తంలో సంపాదించారని ఇమ్రాన్‌పై ఆరోపణలొచ్చాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి బదులు ఇవ్వకపోవడంతో పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఇమ్రాన్‌పై అనర్హతా వేటు వేసింది. 2022లో ఉన్నట్టుండి ఆయన తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడిదే కేసులో పాక్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..