లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు రక్షణగా పాక్‌ ఆర్మీ! భద్రతను 4 రెట్లు పెంచిన పాకిస్థాన్‌

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి ప్రతిస్పందనగా పాకిస్థాన్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ భద్రతను నాలుగు రెట్లు పెంచింది. లాహోర్‌లోని ఆయన నివాసం చుట్టూ నిఘా, సైనిక కాపలా, డ్రోన్ పర్యవేక్షణ పెంచారు. ఐక్యరాజ్యసమితి, అమెరికా ఉగ్రవాదిగా గుర్తించినా సయీద్ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా ఉన్నాడు.

లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు రక్షణగా పాక్‌ ఆర్మీ! భద్రతను 4 రెట్లు పెంచిన పాకిస్థాన్‌
Hafiz Saeed

Updated on: May 01, 2025 | 2:59 PM

పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ దాదాపు నాలుగు రెట్లు భద్రతను పెంచింది. లాహోర్‌లోని సయీద్ నివాసం చుట్టూ ఇప్పుడు విస్తృతమైన నిఘా ఉంచారు. పాకిస్థాన్‌ ఆర్మీ నుంచి ప్రత్యేక సిబ్బందిని సయీద్‌ భద్రత కోసం మొహరించారు. లాహోర్‌లో రద్దీగా ఉండే మొహల్లా జోహార్ టౌన్‌లో ఉన్న హఫీజ్ సయీద్ ఇంటి చుట్టూ ప్రస్తుతం పాక్‌ సైనికులు కాపలాగా ఉన్నారు. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ, లష్కరే కార్యకర్తలు సంయుక్తంగా అతని రక్షణను పర్యవేక్షిస్తున్నారని, ఆ ప్రాంగణాన్ని పర్యవేక్షించడానికి డ్రోన్ నిఘాను ఏర్పాటు చేసినట్లు, 4 కిలోమీటర్ల వరకు రోడ్లపై హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

అలాగే ఆయన ఇంటి దగ్గర సామాన్య ప్రజలకు అనుమతి లేదు, ఆ ప్రాంతంలో డ్రోన్‌లను కూడా నిషేధించారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) పహల్గామ్‌లో దాడికి పాల్పడిన కొద్దిసేపటికే భద్రతా ప్రోటోకాల్‌ను అమలులోకి తెచ్చినట్లు సమాచారం. ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో సయీద్‌కు భద్రతను మరింత పెంచారు. ఐక్యరాజ్యసమితి, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినప్పటికీ సయీద్ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా నివసిస్తున్నాడు. అతని నివాసం రహస్యంగా కాకుండా లాహోర్ నడిబొడ్డున ఉంది. అతని ఇంట్లో ఒక పెద్ద మసీదు, అతని కార్యాచరణ స్థావరంగా పనిచేస్తున్న మదర్సా, కొత్తగా నిర్మించిన ప్రైవేట్ పార్క్ ఉన్నాయి.

ప్రస్తుతం సయీద్‌ జైలులో ఉన్నాడని పాకిస్థాన్‌ పదే పదే చేస్తున్న వాదనలకు విరుద్ధంగా, పాకిస్తాన్ భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో సయీద్ హాయిగా జీవిస్తున్నట్లు సమాచారం. ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ కూడా సయీద్ భద్రతను సమీక్షించిందని, అతని నివాసాన్ని ‘సబ్-జైలు’గా మారుస్తున్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగా కస్టడీలో ఉంటూనే కనీస పరిమితులతో పనిచేయడానికి వీలు కల్పిస్తుంది పాకిస్థాన్‌. 2021లో సయీద్ ఇంటి దగ్గర కారు బాంబు పేలి ముగ్గురు మృతి చెందిన తర్వాత, అక్కడ భద్రతను ఇప్పటికే పెంచారు. గత నెలలో అతని సన్నిహిత సహాయకుడు అబూ ఖతల్ హత్య తర్వాత అతని భద్రతను మళ్లీ కట్టుదిట్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి