Pakistan: వెంటాడుతున్న పహల్గామ్ పాపం!.. పాకిస్థాన్‌లో భయం భయం!
భారత్‌తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఎవడికైనా మడతడిపోవాల్సిందే. ఇప్పుడు పాకిస్థాన్‌కు ఈ ముచ్చట బాగా అర్థమైంది. అందుకే, దినదినం కాదు క్షణక్షణం పెద్ద గండంలా గడుపుతోంది పాపాల పుట్ట పాక్. ఆదేశ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైందంటేనే అక్కడ సిట్యుయేషన్ ఎంత సీరియస్‌గా ఉందో ఊహించుకోవచ్చు.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి పాపం పాకిస్థాన్‌ను వెంటాడుతోంది. ఈ దాడి తర్వాత భారత్ తన విశ్వరూపాన్ని చూపిస్తుండటంతో.. దాయాదికి దిక్కుతోచడం లేదు. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో.. ఇండియాను తట్టుకోవడం ఎలాగో పాకిస్థాన్‌కు అర్థం కావడం లేదు. ఇప్పటికే పాక్‌తో అన్ని రకాల సంబంధాలను తెంచేసుకున్న భారత్.. ఏ క్షణమైనా సైనిక చర్యకు దిగేందుకు సన్నద్ధమవుతోంది. తుది నిర్ణయం త్రివిదదళాలదేనని ప్రధాని మోదీ స్పష్టం చేయడంతో పాటు… అందుకుతగ్గట్టే భారతసైన్యం సన్నద్ధమవుతున్న తీరు పాక్‌ను కలవరపెడుతోంది. అందుకే, హై అలర్ట్ ప్రకటించిన పాక్‌ప్రభుత్వం… తన బలగాలను సిద్ధం చేసుకుంటూనే, మరోవైపు ప్రజలకు కూడా కీలక సూచనలు చేస్తోంది. ఇప్పటికే బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంతర్యుద్ధాన్ని ముమ్మరం చేయడం.. ఓవైపు భారతసేనలు దూసుకొస్తుండటంతో.. ఎటూ అంతుచిక్కని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది పాక్.
పాకిస్తాన్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం
పాక్ అధ్యక్షుడు జర్దారీ.. హుటాహుటిన ప్రత్యేక విచక్షణాధికారం ఉపయోగించి… పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చారంటేనే అక్కడి పరిస్థితి స్పష్టంగా తెలిసిపోతోంది. దీనికి సంబంధించి శనివారం అర్ధరాత్రి నోటీసులు జారీ అయితే… ఆదివారం ఆగమేఘాల మీద పాక్ పార్లమెంట్ సమావేశమైంది. ఇండో, పాక్ ఉద్రిక్తతలు భీకరస్థాయికి చేరిన వేళ… ఈ ప్రత్యేక భేటీ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
భారత్‌కు రష్యా మద్దతును ఆపడం సాధ్యమేనా?
పార్లమెంట్ వేదికగానే పరిస్థితిని రాజకీయ పార్టీలకు వివరించిన పాక్ అధ్యక్షుడు.. భారత్‌తో యుద్ధం గనక వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. పాక్‌కు మద్దతిచ్చే దేశాలేవి? భారత్ వెంట నిలిచే దేశాలేవి? అనే లెక్కలేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు, అంతర్జాతీయంగా భారత్‌కు సపోర్టు దొరకకుండా పాక్ కుయుక్తులు పన్నుతున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా భారత్‌కు రష్యా మద్దతు ఇవ్వకుండా .. తెరవెనక విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పటికే బంకర్‌లను సిద్ధం చేస్తోంది పాక్ ఆర్మీ. రిజర్వు బలగాలను రంగంలోకి దించింది. ఏ సమయంలోనైనా భారత్ దాడి చేసే అవకాశం ఉందనే భయంతో.. అక్కడి స్థానికులకు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, మందులు సిద్ధం చేసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వం సూచించింది.
ఇప్పటికే పీఓకేలో వెయ్యి మదర్సాలు మూసివేత
ఉగ్రవాద శిక్షణ శిబిరాలకు నిలయంగా మారిన మదర్సాలపైన ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేస్తుందనే అనుమానంతో.. ఇప్పటికే అక్కడి వెయ్యి మదర్సాలను మూసేసిన పాక్.. పిల్లలకు సైతం పాకిస్థాన్ ఆయుధ శిక్షణను ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు భారత్,, త్రివిధ దళాలను అప్రమత్తం చేయడంతో పాటు.. గగనతలంలో ఎయిర్ ఫోర్స్, సముద్ర మార్గాల్లో నేవీ విన్యాసాలను ముమ్మరం చేసింది. దీంతో సరిహద్దులకు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ యుద్ధ పరిస్థితులపై సైన్యంతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ చర్యలతో అన్నిరకాలుగా బిగుసుకుపోయిన పాక్.. యుద్ధాన్ని ఎలా ఎదుర్కొంటుందన్నదే ఆసక్తికరాంశం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
