ప్రపంచవ్యాప్తంగా 107 దేశాల్లో కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్.. ఇప్పటి వరకు 20కోట్ల మందికి టీకాలు
కరోనా ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. కొన్ని నెలల కిందట ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సత్ఫలితాలనే ఇస్తున్నాయి.
Globally COVID-19 vaccination : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ వల్ల ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే పలు దేశాలు కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. కరోనా ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. కొన్ని నెలల కిందట ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సత్ఫలితాలనే ఇస్తున్నాయి. మరో వైపు టీకాల పంపిణీ వేగవంతంగా కొనసాగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా 107 దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 కోట్ల మందికి టీకాలు పంపిణీ చేసినట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ప్రపంచ జనాభాలో సుమారు 10శాతం మందికి ఈ టీకా అందినట్లు పేర్కొంది. వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న దేశాల్లో అత్యధికంగా అధిక ఆదాయ దేశాలున్నట్లు వెల్లడించారు. పేద, మధ్యతరగతి దేశాలకు కూడా వ్యాక్సిన్లను అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచూ విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 11 కోట్లకు పైగా నమోదయ్యాయి.
కరోనా వైరస్ కారణంగా అత్యధికంగా ప్రభావితమైన దేశం అగ్రరాజ్యం అమెరికా. అక్కడ ఇప్పటివరకు సుమారు 6 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందించారు. అందులో 4 కోట్లకు పైగా ప్రజలు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని అమెరికాకు చెందిన సీడీసీ సంస్థ వెల్లడించింది. అటు, కరోనాకు పుట్టిల్లు అయిన డ్రాగన్ కంట్రీ చైనాలో ఫిబ్రవరి 9 నాటికీ 4 కోట్ల మంది ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించినట్లు చైనా అధికారిక వర్గాలు వెల్లడించాయి.
కరోనా రెండో విడతలో తీవ్రంగా ప్రభావితమైన యూరోపియన్ యూనియన్ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకగా సాగుతోంది. ఈయూలో ఇప్పటి వరకూ రెండున్నర కోట్ల మందికి వ్యాక్సిన్‌లు అందించారు. అమెరికా అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్న ఈయూ 1.5 బిలియన్లను (150 కోట్లను) పేద దేశాలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇటు, యూకేలో ఇప్పటి వరకు కోటీ డెబ్బైలక్షల మందికి కోవిడ్ టీకాను అందించారు. దీంతో బ్రిటన్ జనాభాలో 26శాతం మందికి వ్యాక్సిన్లు అందించినట్లు యూకే అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇక, భారతదేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. జనవరి 16న మొదలైన వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో 34 రోజుల్లో కోటి మందికి టీకాలను అందించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. వేగవంతమైన వ్యాక్సిన్ పంపిణీలో రెండోస్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.
ఇజ్రాయెల్ దేశం టీకా పంపిణీ ఆరో స్థానంలో కొనసాగుతుంది. కాగా, వారి జనాభాలో 78 శాతం ప్రజలకు వ్యాక్సిన్ అందించి ఇజ్రాయెల్ మొదటిస్థానంలో నిలిచింది. అక్కడి జనాభాలో 78.8 మందికి వ్యాక్సిన్ అందించినట్లు ఆ దేశ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక, బ్రెజిల్‌లో ఇప్పటివరకూ అరవైలక్షలకు పైగా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలావుంటే, కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో సమతూల్య పాటించాలని సూచిస్తోంది. పేద, మధ్యతరహా దేశాల్లోనూ వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టాలని సూచిస్తోంది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటి నుంచి తరిమికొట్టాలని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
ఇదీ చదవండిః CCMB Study: షాకింగ్ న్యూస్.. భారత్‌లో 7,569 కరోనా వైరస్ రకాలు.. సీసీఎంబీ పరిశోధనలలో వెల్లడి