ఒలింపిక్స్‌ నిర్వహణకే మొగ్గు చూపుతున్న జపాన్‌ ప్రభుత్వం

| Edited By: Phani CH

May 26, 2021 | 7:00 AM

మా ప్రాణాలతో చెలగాటాలొద్దనీ, ఆటలు మాకు వద్దే వద్దనీ జపాన్‌ ప్రజలు ఎంతగా నెత్తినోరు బాదుకుంటున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

ఒలింపిక్స్‌ నిర్వహణకే మొగ్గు చూపుతున్న జపాన్‌ ప్రభుత్వం
Olympics 2021
Follow us on

మా ప్రాణాలతో చెలగాటాలొద్దనీ, ఆటలు మాకు వద్దే వద్దనీ జపాన్‌ ప్రజలు ఎంతగా నెత్తినోరు బాదుకుంటున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. వచ్చే నెల నాటికి ప్రజల వ్యతిరేకత తగ్గకుండా పోతుందా అన్న ధీమాతో ఉంది. ఇప్పట్నుంచే ప్రజలలో భరోసా ఇచ్చే కార్యక్రమాలను మొదలు పెట్టింది. టోక్యో ఒలింపిక్స్‌కు అట్టే సమయం కూడా లేదు.. మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది.. అందుకే ప్రజలందరకూ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఇప్పించే పనిలో పడింది ప్రభుత్వం. టీకా ప్రక్రియను జెట్‌ స్పీడ్‌లో నిర్వహిస్తోంది. టీకా కేంద్రాలను పెంచింది. అలాగే ముందుగా 65 ఏళ్లు దాటిన వారికి టీకాలు అందిస్తోంది. జులై 23న ఒలింపిక్స్‌ మొదలవుతాయి. ఆ లోపు 65 ఏళ్లు పైబడిన వాళ్లకు టీకాలు ఇచ్చేందుకు సైన్యానికి చెందిన వైద్య సిబ్బంది సాయం కూడా తీసుకుంటోంది ప్రభుత్వం. వచ్చే మూడు నెలలలో అందరికీ టీకా అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న టోక్యో నగరంలో రోజుకు పది వేల మందికి, ఒసాకాలో రోజుకు అయిదు వేల మందికి వ్యాక్సిన్‌ అందించే ప్రయత్నం చేస్తున్నారు. జపాన్‌ తల్చుకుంటే అయిపోతుంది కూడా!

కరోనా విలయతాండవం చేస్తున్న ఇలాంటి సమయంలో ఒలింపిక్స్‌ను నిర్వహించడం సరికాదంటూ జపాన్‌ ప్రజలు అంటున్నారు. నిరసనలు తెలుపుతున్నారు. మెజారిటీ ప్రజల మనోగతం ఇదే.. అయినప్పటికీ ఒలింపిక్స్‌ను నిర్వహించాలనే గట్టి పట్టుదలతో ప్రధానమంత్రి యోషిహిదే సుగా ఉన్నారు. ఇప్పుడు నిర్వహించకుంటే లక్షల కోట్ల రూపాయాలు వృధా అవుతాయన్నది ఆయన ఆలోచన! జులై చివరి నాటికి జపాన్‌లో దాదాసు మూడున్నర కోట్ల వృద్ధులకు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఇప్పటి వరకు టీకా ప్రక్రియ చాలా మందకొడిగా సాగింది.. అందుకే ఆ దేశ జనాభాలో రెండు శాతం మందికి కూడా టీకా అందలేదు. ఇప్పుడు ప్రజల భయం అదే! చాలా మందికి ఇంకా టీకాలు అందలేదని, ఇలాంటి సమయంలో ఒలింపిక్స్‌ను నిర్వహించి తమ ప్రాణాలతో చెలగాటం ఆడకూడదంటున్నారు. ప్రభుత్వం మొండివైఖరిని అవలంబిస్తున్నదని విమర్శిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ఇప్పటికే జపాన్‌లో కఠిన ఆంక్షలు ఉన్నాయి. టోక్యో నగరంతో పాటు మరో ఆరు ప్రాంతాలలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందకూడదని, అంతా సజావుగానే జరుగుతుందని ప్రధాని సుగా భరోసా ఇస్తున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని, అందరికీ టీకాను అందిస్తామని ఆయన చెబుతున్నారు. దేశ జనాభాలోని 80 నుంచి 90 శాతం మందికి టీకాలు అందితే అప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఒలింపిక్స్‌ను నిర్వహించవచ్చని అంటున్నారు. అయితే అది సాధ్యమేనా? కేవలం రెండు నెలల వ్యవధిలో అంతమందికి టీకాలు ఇవ్వగలరా? సరిపడినంత వైద్య సిబ్బంది కూడా లేని పరిస్థితులలో టీకాలు ఎలా ఇప్పించగలరు? ఇవన్నీ ప్రశ్నలే!
ఇవన్నీ చూస్తుంటే ఒలింపిక్స్‌ పోటీలు మరోసారి వాయిదా పడతాయేమోనని అనిపిస్తోంది. 80 శాతం మంది ప్రజలు ఒలింపిక్స్‌ వద్దని చెబుతున్నారంటే వారు ఎంత భయాందోళనలో ఉన్నారో అర్థమవుతోంది. ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ఒలింపిక్స్‌ను నిర్వహించుకోవచ్చు…

 

మరిన్ని ఇక్కడ చూడండి: ICT Recruitment 2021: ముంబై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ..

Chanakya Niti: ప్రతి వ్యక్తికీ ఐదుగురు తల్లులు ఉంటారని చెబుతారు ఆచార్య చాణక్య..ఎవరిని ఆ ఐదుగురిగా ఆచార్య చెప్పారు..