భారత్, పాక్‌ల మధ్య 70 ఏళ్లుగా కొనసాగుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమే. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు అన్న మాటలివి. ఐతే క్రమంగా ట్రంప్ వైఖరిలో చేంజ్ వస్తోంది. ఆయన స్వరం మారుతోంది. ఇకపై కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని డొనాల్డ్ నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు అమెరికా భారత రాయబారి హర్షవర్థన్ శ్రింగ్లా. మధ్యవర్తిత్వం ఆఫర్ ఇక చర్చకు రాదని ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలిపారు.
గత నెలలో ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ సందర్భంగా కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వానికి రెడీ. భారత ప్రధాని మోదీ కూడా ఇదే కోరుకుంటున్నారని వెల్లడించారు ట్రంప్. ఆయన వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో జీ 20లో భేటీ సందర్భంగా అసలు ఈ అంశం చర్చకు రాలేదని ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది కేంద్రం. కశ్మీర్‌పై ఎలాంటి చర్చలైనా పాకిస్తాన్‌తో మాత్రమేనని..అది కూడా ద్వైపాక్షిక చర్చలేనని స్పష్టం చేసింది. మూడో వ్యక్తి జోక్యం సహించేది లేదని తేల్చి చెప్పింది. దీంతో భారత్, పాక్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకూడదని ట్రంప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కశ్మీర్ వ్యవహారంలో కలగజేసుకోకూడదనేది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న విధానమని..ఐతే ఈ సమస్యను భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మాత్రం ప్రోత్సహిస్తూ వస్తోందని వెల్లడించారు హర్షవర్థన్ శ్రింగ్లా.మరోవైపు ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత తీసుకున్న నిర్ణయంపైనా స్పందించిన అమెరికా.. అది పూర్తిగా ఇరు దేశాల ద్వైపాక్షిక అంశమేనని ..శాంతియుత వాతావరణంలో సామరస్యకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.