అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి విమర్శకుల నోళ్లలో నానుతూనే ఉన్నారు. ఆయన భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంక ట్రంప్‌ను కూడా విమర్శకులు వదిలిపెట్టడం లేదు. ట్రంప్ శ్వేత సౌధంలో కొనసాగినన్ని రోజులు ఆయన కుటుంబం మొత్తం ప్రజాసొమ్మును తమ సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. మెలానియా ట్రంప్ వీకెండ్ స్పా ఖర్చు కోసం ఏకంగా 64వేల డాలర్లు ఖర్చుపెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ట్రంప్ కుటుంబానికి నాలుగేళ్లలో భద్రత కల్పనకు అయిన ఖర్చు 600 మిలియన్ డాలర్లు(రూపాయల్లో చెబితే దాదాపుగా 4,377 కోట్లు)గా వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ కరోల్ లియోనింగ్ తన తాజా రచన’జీరో ఫెయిల్’ పుస్తకంలో వెల్లడించారు.
డోనాల్డ్ ట్రంప్ కు పోర్న్ స్టార్ స్టొర్మి డేనియల్ తో అఫైర్ ఉన్నట్లు వార్తలు రావడంతో ట్రంప్ భార్య మెలానియా అకస్మాత్తుగా మార్ ఎ లాగో క్లబ్ కు వెళ్లి రెండు రోజుల పాటు గడిపారు. ఈ నేపథ్యంలో మెలానియా భద్రతకైన ఖర్చులు, ఇతర సందర్భాల్లో ట్రంప్ కుటుంబ సభ్యుల భద్రత ఏర్పాటకు చేసిన ఖర్చులను రచయిత కరోల్ వెల్లడించారు.
అప్పట్లో ట్రంప్ అఫైర్ వివరాలను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. మెలానియా ట్రంప్ కు మూడో భార్య కాగా…తన ఇద్దరు పాత భార్యలకు విడాకులు ఇచ్చిన తర్వాత మెలానియాను పెళ్లి చేసుకున్నారు ట్రంప్. వీరిద్దరికీ 15 ఏళ్ల కుమారుడు(బారన్) ఉన్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్, మెలానియా మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయని తెలుస్తోంది.
అమెరికా ప్రథమ మహిళ హోదాలో భర్త ట్రంప్ తో అధికారిక కార్యక్రమాలకు హాజరు కావడానికి మెలానియా విముఖత చూపేదని అమెరికా మీడియాలో ప్రచారం జరిగింది.
భర్త డొనాల్డ్ ట్రంప్ అధికార పర్యటనల్లో బిజీగా ఉంటే మెలానియా ఫ్లొరిడాలోని మార్ -ఎ-లాగో లోని స్పా కు వెళ్లేదని రచయిత సదరు పుస్తకంలో వెల్లడించారు. భర్త మీద కినుకతో అకస్మాత్తుగా మార్ -ఎ-లాగో లోని స్పాకు వెళ్లిన మెలానియా (రెండు రోజుల ట్రిప్) అయిన ఖర్చు 64వేల డాలర్లను ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించారు. మెలానియా ప్రత్యేక విమానం, ఇతర భద్రత ఏర్పాట్లను అమెరికా సీక్రెట్ సర్వీస్ భద్రతా విభాగం చూసింది.
2020 ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం… ట్రంప్, మెలానియా కుటుంబీకులు వైట్ హౌస్ వీడారు. 13 మంది సభ్యులున్న తన కుటుంబానికి రక్షణ కాలంను మరో అరు నెలలు పొడిగించుకున్నారు ట్రంప్. చట్ట ప్రకారం.. ట్రంప్, మెలానియా దంపతులకు జీవితాంతం సీక్రెట్ సర్వీసెస్ భద్రత కొనసాగుతుంది. వీరి కుమారుడు బారన్ కు 16 ఏళ్లు వచ్చేవరకు సీక్రెట్ సర్వీసెస్ భద్రత కల్పించనుంది. ట్రంప్ కుటుంబానికి రక్షణ కాలం పెంపు, ఈ ఏడాది మేలో కుటుంబ సభ్యుల అబుదాబి ట్రిప్ తో అమెరికా సీక్రెట్ సర్వీసెస్ కు 12,950 డాలర్లు ఖర్చు అయ్యింది.
ట్రంప్ పదవీ కాలం ముగిసిన అనంతరం సాల్ట్ లేక్ సిటీ టూర్లో భాగంగా ట్రంప్ అల్లుడు జరేద్ ఇష్నర్, కూతురు ఇవాంకా ట్రంప్ 10 రోజుల గడిపారు. ఈ టూర్ కు అయిన ఖర్చు 62,599.30 డాల్లరుగా తెలుస్తోంది.
చట్ట ప్రకారం అధ్యక్షుడు తన నివాసానికి వైట్ హౌస్ తో పాటు మరో వ్యక్తిగత నివాసాన్ని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ కూడా సీక్రెట్ సర్వీసెస్ వారంలో 24 గంటల భద్రత కల్పిస్తారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ లోని ట్రంప్ టవర్ 58 అంతస్తుల భవనానికి సీక్రెట్ సర్వీసెస్ రక్షణ కల్పించింది. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత వెంటనే మెలానియా, కుమారుడు బారన్ వైట్ హౌస్ కు మారలేదు. ట్రంప్ టవర్ వద్ద పెంట్ హౌస్ లో వీరు నివాసమున్నారు. ఇక్కడ భద్రత ఏర్పాట్లకోసం అప్పటికప్పుడు 28.3 మిలియన్ డాలర్లను అమెరికా సీక్రెట్ సర్వీసెస్ వెచ్చించింది.
ట్రంప్ దేశాధ్యక్షుడిగా కొనసాగిన నాలుగేళ్లలో ఆయన కంపెనీలు పన్నులు ఎగ్గొట్టాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై క్రిమినల్ విచారణ చేపట్టనుండగా…ఇప్పుడు వీరి కుటుంబ సభ్యులు ప్రజా సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా దుర్వినియోగం చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి…సీఎం అమరీందర్‌తో ఢీ అంటే ఢీ… ఆప్‌లో చేరికపై క్లారిటీ ఇచ్చిన సిద్ధు