Usha Vance: అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రా అల్లుడే.. సెకండ్‌ లేడీ మన తెలుగమ్మాయి ఉషా గురించి మీకు తెలుసా..?

|

Nov 07, 2024 | 12:01 AM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్... ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్‌ వ్యవహరించనున్నారు. అంటే.. ఆంధ్రా అల్లుడు అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షుడిగా అయ్యారన్నమాట.. అదేంటి..? జెడీ వ్యాన్స్ ఆంధ్రా అల్లుడా...? జెడీ వ్యాన్స్ ఆంధ్రాకు సంబంధం ఏంటి..? అలా ఎలా అనుకుంటున్నారా..? అయితే.. ఈ స్టోరీ ఒకసారి చదివేయండి..

Usha Vance: అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రా అల్లుడే.. సెకండ్‌ లేడీ మన తెలుగమ్మాయి ఉషా గురించి మీకు తెలుసా..?
Usha Chilukuri Us
Follow us on

డొనాల్డ్ ట్రంప్ చరిత్ర లిఖించారు.. అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టనున్నారు. హోరాహోరీగా జరిగిన అధ్యక్షుడి ఎన్నికల పోరులో కమలా హారిస్‌పై ట్రంప్‌ విజయం సాధించారు.. మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించి.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు 226 ఎలక్టోరల్ ఓట్లు పోలయ్యాయి. సెనెట్‌, పాపులర్‌ ఓట్లలోనూ ట్రంప్‌దే పైచేయి కనిపించింది.. అయితే.. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా.. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్‌ గా వ్యవహరించనున్నారు. అంటే.. ఆంధ్రా అల్లుడు అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారన్నమాట.. అదేంటి..? జెడీ వ్యాన్స్ ఆంధ్రా అల్లుడా.. అలా ఎలా అనుకుంటున్నారా..? అయితే.. ఈ స్టోరీ చదివేయండి..

జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగమ్మాయి కావడం ఇందుకు నేపథ్యం. అంటే.. ఆమె అమెరికాకు సెకండ్‌ లేడీగా వ్యవహరించబోతున్నారు.. ఒహాయో రాష్ట్ర సెనేటర్‌గా జేడీ వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ ఎంపిక చేసుకున్నప్పటి నుంచే ఉషా పేరు ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు.. అటు అమెరికాలో కూడా మార్మోగింది.. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయంతో ఉష చిలుకూరి పేరు మరోసారి తెరపైకి వచ్చింది.

Usha Chilukuri

న్యాయవాది ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి… ఆమె పూర్వికులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని వడ్లూరు గ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980ల్లోనే అమెరికా దేశానికి వలస వెళ్లారు. వీళ్ల ముగ్గురు సంతానంలో ఉషా ఒకరు.. తల్లి లక్ష్మి మాలిక్యులర్‌ బయాలజీ, బయో కెమిస్ట్రీ రంగ నిపుణురాలు. ప్రస్తుతం ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తూనే, శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో కీలకమైన పదవిలో ఉన్నారు. తండ్రి రాధాకృష్ణ.. క్రిష్‌ చిలుకూరిగా అందరికీ పరిచయం.. ఆయన ఏరోస్పేస్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

అయితే.. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టి పెరిగారు. యేల్‌ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌, జస్టిస్‌ బ్రెట్‌ కెవానా వద్ద విధులు నిర్వర్తించారు. పటిష్ఠమైన విద్యా నేపథ్యమున్న ఆమె.. యేల్‌ విశ్వవిద్యాలయంలో లా అండ్‌ టెక్‌ జర్నల్‌కు మేనేజింగ్‌ ఎడిటర్‌గా, యేల్‌ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్‌ డెవలప్‌మెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. అనంతరం కేంబ్రిడ్జి యూనివర్సిటీకి గేట్స్ ఫెలోగా వెళ్లారు. అక్కడ ఆమె లెఫ్ట్‌-వింగ్‌, లిబరల్‌ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు.

వాన్స్‌తో పరిచయం – ప్రేమ పెళ్లి..

2013లో యేల్‌ లా స్కూల్‌లో ఉషా, జెడి.వాన్స్‌ తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2014లో కెంటకీలో ఇద్దరూ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. వీరికి ముగ్గురు సంతానం.. కుమార్తె మిరాబెల్, కుమారులు ఇవాన్, వివేక్ ఉన్నారు.

Usha Vance

కాగా.. భర్త విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు. రాజకీయంగా ఆయనకు అనేక విషయాల్లో అండగా నిలబడ్డారు. ఒహాయో సెనేటర్‌గా పోటీ చేస్తున్న సమయంలో ప్రచారంలో ఉష కీలక బాధ్యతలు నిర్వర్తించి.. విపక్షాల ఆరోపణలను, విమర్శలను తిప్పికొట్టారు.. ఇలా భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు. రిపబ్లికన్ల తరఫున సెకండ్‌ లేడీగా వ్యవహరించనున్న ఉషా వాన్స్‌.. 2014లో డెమోక్రాటిక్‌ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకోవడం గమనార్హం.. ఆ తర్వాత భర్త వెంట రాజకీయాల్లో నడిచారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి