ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించిన దేశాలు..ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. మరో వైపు కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒక వైపు కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టి అన్‌లాక్‌లో ఉంటే.. జర్మనీ దేశం మాత్రం లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమవుతోంది. కరోనా కట్టడి కోసం డిసెంబర్ 16 నుంచి జనవరి 10వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించనున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెలా ప్రకటించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నేలతో సమావేశమైన మెర్కెల్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
క్రిస్మస్ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ లాక్‌డౌన్ ఆదేశాలు నిత్యవసర వస్తువులకు సంబంధించి మాల్స్‌కు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ లాక్‌డౌన్ నిర్ణయంతో అన్ని సంస్థలు మూతపడనున్నాయి. తాజాగా జర్మనీలో 20,200 కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 321 మంది మృతి చెందారు.
ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు, బార్లు, ఇతర కేంద్రాలు సైతం నవంబర్ నుంచి మూతపడ్డాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
న్యూఇయర్ వేడుకలపై నిషేధం
కాగా, కోవిడ్ ప్రభావం జర్మనీ న్యూఇయర్ వేడుకలపై పడింది. న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. క్రిస్మస్ సందర్భంగా కేవలం ఐదుగురు మాత్రమే ఒక చోట చేరడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్ కారణంగా ఆరోగ్య రంగంపై అధిక భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మెర్కెల్ వెల్లడించారు. అయితే మిగతా యూరప్ దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి విషయంలో జర్మనీ మెరుగ్గానే ఉంది. అయితే ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే జర్మనీలో ఇప్పటి వరకు 13 లక్షల మంది కరోనా బారిన పడగా, 22 వేల మంది మృతి చెందారు. ఇలా ఆ దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధిస్తున్నారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచ దేశాలు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు మూడో దశలో ఉండగా, మరి కొన్ని వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చేందుకు అందుబాటులో ఉన్నాయి.