కరోనాతో ఉక్కిరిబిక్కిరి అయిన మానవాళిని వరుసగా వైరస్‌లు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక దాని నుంచి తేరుకునే లోపే మరో వైరస్ దాడి చేస్తుంది. రకరకాల వేరియంట్లు మనుషులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి ఈ క్రమంలో అమెరికా శాస్త్రవేత్తలు మరో బ్యాడ్ న్యూస్ అందించారు. కరోనా లాంటిదే మరో కొత్త రకం వైరస్‌ను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఖోస్టా-2గా పిలుస్తున్న ఈ వైరస్.. మనుషుల్లో వ్యాపించి అత్యధిక డ్యామేజ్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు దీనిపై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదని స్పష్టం చేశారు.
చైనాలో 2019లో తొలుత కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. దీని పుట్టుకపై ఉన్న ప్రశ్నలకు ఇంకా ఎలాంటి సమాధానాలు లేవు. అయితే.. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు సోకి ఉంటుందని పలు అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించిన ఖోస్టా-2 వైరస్‌ని కూడా.. 2020లో తొలిసారిగా రష్యాలోని గబ్బిలాల్లోనే కనిపించడం గమనార్హం.
ఖోస్టా-2 వైరస్‌పై 2020లోనే పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు.. ఇది మనుషులపై ప్రభావం చూపించదు అని భావించారు. తాజాగా మరోమారు జరిగిన పరిశోధనల్లో మాత్రం.. ఈ వైరస్ మనుషులకు సోకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా టీకా వేసుకున్న వారిపైనా ఇది ప్రభావం చూపిస్తుండటం ఆందోళనకర విషయం. ఇందుకు సంబంధించిన రీసెర్చ్.. జర్నల్ పీఎల్ఓఎస్ పాథోజెన్స్లో పబ్లీష్ అయ్యింది. సార్స్-కోవ్2, ఖోస్టా 2 వైరస్‌లు.. సర్బెకొవైరస్ జాతికి చెందినవిగా నిపుణులు గుర్తించారు. టైమ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం.. ఖోస్టా 1.. మనుషులపై ప్రభావం చూపించదు. కానీ ఖోస్టా 2 మాత్రం మనుషులకు ముప్పుగా మారే అవకాశం ఉంది. మనిషి కణాల్లోకి కొవిడ్ ఏ విధంగా ప్రవేశించిందో.. ఈ ఖోస్టా 2 వైరస్ కూడా అదే విధంగా వెళుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు మరణాలు కూడా సంభవించే ప్రమాదం ఉందంటున్నారు.
అయితే ఇక్కడ ఒక ఊరటనిచ్చే విషయాన్ని చెప్పారు శాస్త్రవేత్తలు. ఒమిక్రాన్లాగా.. తీవ్రమైన ఆనారోగ్య సమస్యలను సృష్టించే జీన్స్ ఈ ఖోస్టా 2కు ప్రస్తుతం లేదని వెల్లడించారు. అయితే.. సార్స్ కొవ్ 2 జీన్స్‌తో ఇది కలిస్తే.. ప్రమాదం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ ఖోస్తా 2 ప్రస్తుతం జంతువుల్లోనే వ్యాపిస్తోంది. ఇది మరో మహమ్మారిగా మారుతుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. సార్స్-కొవ్ 2, ఖోస్టా 2లు కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంది. కానీ జంతువుల్లో ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి వైరస్ల నుంచే కాకుండా ఇతర సర్బెకొవైరస్ల నుంచి రక్షణ పొందే విధంగా టీకాల తయారీకి కృషి చేస్తున్నారు సైంటిస్టులు. ఇప్పుడున్న టీకాలు.. కేవలం ఒక్క వైరస్ కోసమే రూపొందించారు. అందువల్ల వేరే వైరస్‌లపై అవి పనిచేయడం లేదు. అన్ని రకాల వైరస్ల నుంచి రక్షణ పొందే విధంగా టీకాలను అభివృద్ధి చేయడం ఇప్పుడు అత్యంత అవసరమంటున్నారు నిపుణులు.
ఖోస్టా-2 వైరస్ 2020లోనే గుర్తించినప్పటికీ ప్రజలకు ముప్పు కలిగిస్తుందని శాస్త్రవేత్తలు భావించలేదు. కానీ మైఖేల్ లెట్కో శాస్త్రవేత్తల బృందం మరింత జాగ్రత్తగా చేసిన పరిశోధనల్లో వైరస్ మానవ కణాలకు సోకుతుందని గుర్తించారు. గత కొన్ని సంవత్సరాలలో ఎక్కువగా ఆసియా గబ్బిలాలలో వందలాది సార్బెకోవైరస్‌లు కనుగొనబడ్డాయి. కానీ వాటిలో ఎక్కువ భాగం మానవ కణాలకు సోకే సామర్థ్యాన్ని కలిగి లేవు. మొదట్లో ఖోస్టా-2 కూడా అలాగే భావించారు. అయితే ఇటీవలి పరిశోధన మానవులలో సంక్రమణ వ్యాప్తి గురించి ఆందోళనలను రేకెత్తిస్తోంది.
కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ అని అమెరికా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మనిషి కణాలకు ఇన్‌ఫెక్షన్ సోకించడంతో పాటు ప్రస్తుత వ్యాక్సిన్‌లకు ఈ వైరస్ నిరోధకతను కలిగి ఉంటుందని సైంటిస్టులు నిర్దారించారు. అంటే.. కరోనా వైరస్ నుంచి ఉపశమనం కోసం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీస్‌పైనా తీవ్ర ప్రభావం కూడా చూపెడుతుందని వెల్లడించారు. గబ్బిలాలతో పాటు పాంగోలిన్స్, రకూన్ డాగ్స్, పామ్ సివెట్స్ జీవుల ద్వారా ఖోస్టా-2 వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఈ వైరస్ విజృంభణపై, వ్యాక్సినేషన్ తయారీపై ఒక అంచనాకి రాలేమని నిపుణులంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..