Air Strikes: సిరియాపై అమెరికా వైమానిక దాడులు.. ఇది ఇరాన్‌కు హెచ్చరిక: జో బైడెన్

|

Feb 27, 2021 | 8:25 AM

US carries out airstrikes against Iran: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ మార్క్ పాలన మొదలైంది. పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే.. పక్క దేశాల బెదిరింపులకు ఏమాత్రం భయపడేది లేదంటూ..

Air Strikes: సిరియాపై అమెరికా వైమానిక దాడులు.. ఇది ఇరాన్‌కు హెచ్చరిక: జో బైడెన్
Follow us on

US carries out airstrikes against Iran: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ మార్క్ పాలన మొదలైంది. పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే.. పక్క దేశాల బెదిరింపులకు ఏమాత్రం భయపడేది లేదంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ఆదేశాలతో సిరియాపై మళ్లీ అమెరికా దాడులు చేసింది. ఇరాన్‌ మద్దతు కలిగిన ఇరాక్‌ మిలిటెంట్‌ గ్రూపు స్థావరాలపై గురువారం రాత్రి అమెరికా వైమానిక దాడులు చేసింది. అమెరికా తాజాగా జరిపిన దాడిలో ఇరాక్ ఉగ్రవాద సంస్థకి చెందిన పలు స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో 22 మంది మరణించారని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ చెబుతోంది. అయితే ఇరాక్‌ సైన్యానికి చెందిన అధికారి మాత్రం ఒక్కరే మరణించారని పెర్కొన్నారు. అయితే పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన వెల్లడించారు.

ఆ దాడులకు హెచ్చరికగా..
ఫిబ్రవరి మొదట్లో ఇరాక్‌లో అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన రాకెట్‌ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులకు దిగినట్టుగా అమెరికా స్పష్టంచేసింది. అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సైనిక చర్యలకు దిగడం ఇదే మొదటిసారి. అమెరికా దాడుల్లో సిరియా, ఇరాక్‌ సరిహద్దుల్లో ఉన్న కతాబ్‌ హెజ్బుల్లా గ్రూపుకి చెందిన స్థావరాలకు మారణాయుధాలను తీసుకువెళుతున్న మూడు లారీలు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ ఉగ్రవాదం సంస్థను హెజ్బుల్లా బ్రిగేడ్స్‌ అని కూడా పిలుస్తుంటారు.

ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. ఈ దాడుల గురించి శుక్రవారం మాట్లాడారు. తూర్పు సిరియాలో ఇరాన్-మద్దతుగల మిలీషియాపై అమెరికా వైమానిక దాడి చేసినట్లు స్పష్టంచేశారు. అధికారం చేపట్టిన తరువాత ఈ దాడులు మొదటిసారని.. దీనిని ఇరాన్ ఒక హెచ్చరికగా చూడాలని పేర్కొన్నారు. ఇరాన్ ఇప్పటికైనా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ఆయన హెచ్చరించారు.

ఇరాక్‌లో అమెరికా బలగాలకు అండగా ఉంటాం..
సిరియాలో వేటిని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగామో తమకు బాగా తెలుసునని.. ఇప్పటికైనా కుట్రకు పాల్పడే దేశాలు గమనించాలని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ చెప్పారు. మధ్య ప్రాచ్యంలో అమెరికా సైనిక బలగాల్ని మరింతగా విస్తరించి పట్టు పెంచుకోవడం కోసం బైడెన్‌ ఈ దాడులకు ఆదేశాలివ్వలేదని, ఇరాక్‌లో అమెరికా బలగాలకు మద్దతుగా ఉండడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. లెబనీస్‌ హెజ్బుల్లా ఉద్యమం నుంచి విడిపోయిన ఇరాకీ కతాబ్‌ గ్రూపు మిలిటెంట్లు గతంలో ఇరాక్‌లో అమెరికా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్టు అగ్రరాజ్యం అమెరికా బహిరంగంగా ఆరోపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

 

Also Read:

జర్నలిస్ట్ ఖషోగ్గీ హత్యపై అమెరికా దర్యాప్తు.. సౌదీ యువరాజు హస్తం ఉన్నట్టు ఆరోపణలు.. సీఐఏ దర్యాప్తులో సంచలన నిజాలు..

Twitter CEO: ఎట్టకేలకు అభ్యంతర కంటెంట్‌పై స్పందించిన ట్విట్టర్‌ సీఈఓ.. విశ్వాసం సన్నగిల్లుతుందంటూ వ్యాఖ్యలు..