ఇజ్రాయెల్, అక్టోబర్ 2: హెజ్‌బొల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్ మంగళవారం రాత్రి ఒక్కసారిగా 180 క్షిపణులతో విరుచుకుపడింది. అయితే వీటిల్లో చాలా మటుకు ఇజ్రాయెల్ యారో ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఇది సైన్స్ ఫిక్షన్ మువీ కాదు.. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నెలకొన్న పరిస్థితి అని ఇజ్రాయెల్ ఎక్స్ ఖాతాలో ఇరాన్ క్షిపణుల దాడులకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే ఇరాన్ తాజా దాడితో ఇజ్రాయెల్ కోపం నషాలానికి అంటినట్లైంది. దీనికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించింది. ఇరాన్ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టేందుకు అర్హత లేదని నెతన్యాహు సర్కార్ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ దాడిని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఖండించలేదని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పేర్కొన్నారు.
𝐍𝐨 𝐭𝐡𝐢𝐬 𝐢𝐬𝐧’𝐭 𝐚 𝐬𝐜𝐢𝐞𝐧𝐜𝐞 𝐟𝐢𝐜𝐭𝐢𝐨𝐧 𝐦𝐨𝐯𝐢𝐞.
This is Israel right now.
RT this so the entire world knows. pic.twitter.com/ok8CxCXxnP
— Israel ישראל (@Israel) October 1, 2024
ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు అండగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎన్‌ఓ చరిత్రలో ఆయనో మాయని మచ్చ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. గుటెరస్ ఉన్నా లేకున్నా ఇజ్రాయెల్ తమ ప్రజలను రక్షించుకుంటుందని తెగేసి చెప్పారు. దేశ గౌరవాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. గుటెరస్‌ను ‘పర్సనా నాన్ గ్రాటా’గా ప్రకటించినట్లు వెల్లడించారు. ఆయన ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇరు దేశాల పరస్పర దాడులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.