ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ.. అసలేం జరిగిందంటే..?

Benjamin Netanyahu: కొన్ని గంటల పాటు ఇజ్రాయెల్ ప్రధాని నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ట్రెండింగ్‌లోనే ఉన్న నెతన్యాహు.. సోమవారం మాత్రం వేరే చర్చకు దారితీశారు. బెంజమిన్ నెతన్యాహు ఎక్కడ? అనే ప్రశ్న ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. మరి నెతన్యాహు సేఫ్‌గా ఉన్నారా..? అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ.. అసలేం జరిగిందంటే..?
Where Is Benjamin Netanyahu

Updated on: Mar 03, 2026 | 10:47 AM

ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబడిందా? గత మూడు రోజులుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకవైపు ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణం, మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆచూకీపై నెలకొన్న సస్పెన్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. శనివారం తెల్లవారుజామున అమెరికా సెంట్రల్ కమాండ్, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్‌పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఆదివారం ఇరానియన్ మీడియా అధికారికంగా ధృవీకరించింది. దీనితో ఇరాన్ రగిలిపోతోంది.

ప్రతీకార దాడి.. నెతన్యాహు టార్గెట్..?

ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్‌లోని నెతన్యాహు కార్యాలయం, ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఆఫీస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడి తర్వాత నెతన్యాహు పరిస్థితిపై అనిశ్చితి నెలకొందని ఇరాన్ ప్రకటించగా, అటువంటి దాడి ఏదీ జరగలేదని ఇజ్రాయెల్ కొట్టిపారేసింది.

నెతన్యాహు ఎక్కడ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో Where is Benjamin Netanyahu? అనే ప్రశ్న ట్రెండింగ్‌లో ఉంది. గత కొద్ది గంటల పాటు నెతన్యాహు నుంచి ఎటువంటి పోస్ట్ రాకపోవడం, ఇరాన్ ప్రకటన నేపథ్యంలో నెటిజన్లు నెతన్యాహు ఎక్కడంటూ పోస్టులు పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిన్న రాత్రి వరకు నెతన్యాహు ఎటువంటి పోస్టులు పెట్టలేదు. నెతన్యాహు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో సుమారు 19 గంటల క్రితం రక్షణ మంత్రితో జరిపిన భద్రతా చర్చల ఫోటోను షేర్ చేశారు. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో నెతన్యాహు సురక్షిత ప్రాంతానికి వెళ్లారా? లేక ఇరాన్ దాడుల్లో ఏమైనా జరిగిందా? అని నెటిజన్లు మీమ్స్, పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అయితే నిన్న రాత్రి ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్న వీడియో పోస్ట్ చేయడంతో ఈ వాదనలకు చెక్ పడింది.

ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలు

శనివారం దాడితో మొదలైన ఈ ఉద్రిక్తత.. తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్ ప్రతీకార చర్యలతో మధ్యప్రాచ్యంలోని మరికొన్ని దేశాలు కూడా ఈ యుద్ధంలోకి లాగబడే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఊపిరి బిగబట్టి నెతన్యాహు ఇచ్చే తదుపరి ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకవైపు ఖమేనీ మరణం ఇరాన్‌ను కుంగదీస్తుంటే, నెతన్యాహు సైలెన్స్ ఇజ్రాయెల్ వ్యూహమా లేక ప్రమాదమా అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us